తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఈసీ న‌జ‌ర్.. అధికారుల‌కు కీల‌క ఆదేశాలు

By Mahesh Rajamoni  |  First Published Aug 27, 2023, 11:29 PM IST

Hyderabad: ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను సీరియస్ గా తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలంగాణ సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. సీఈవో కార్యాలయం, ఈసీఐ పంపిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, జాప్యం లేకుండా వాస్తవ నివేదికలను సీఈవో కార్యాలయానికి పంపాలని డీఈవోలను ఆదేశించారు. 
 


Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌లకు సంబంధించిన కీల‌క విష‌యాల‌పై ఎన్నిక‌ల సంఘం దృష్టి సారించింది. ఇప్ప‌టి నుంచే ఒక్కొక్క‌టిగా ఏర్పాట్ల‌ను ప్రాభించింది. దీనిలో భాగంగా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను సీరియస్ గా తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలంగాణ సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. సీఈవో కార్యాలయం, ఈసీఐ పంపిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, జాప్యం లేకుండా వాస్తవ నివేదికలను సీఈవో కార్యాలయానికి పంపాలని డీఈవోలను ఆదేశించారు.

ఇటీవ‌ల ప‌లువురు ఎమ్మెల్యేల‌కు సంబంధించిన ఫిర్యాదుల‌పై కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో జోక్యం  చేసుకున్న న్యాయ‌స్థానం ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధుల ఎన్నిక‌పై కీల‌క తీర్పులు వెలువ‌రించింది. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం త‌మ‌కు అందుతున్న ఫిర్యాదుల‌పై మ‌రింత దృష్టి సారించింది. అందిన ప్రతి ఫిర్యాదును సీరియస్ గా తీసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టాలనీ, సమగ్ర నివేదికలు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) తెలంగాణ వికాస్ రాజ్ ఆదేశించారు.

Latest Videos

బహదూర్ పురా, గోషామహల్, నాంపల్లి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చిన ఫిర్యాదులపై ఆగస్టు 27 ఆదివారం నిర్వహించిన విస్తృత సమీక్షా సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, పై అసెంబ్లీ నియోజకవర్గాల విచారణాధికారులు పాల్గొన్నారు. డీఈవోలు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఈవో ప్రస్తుతం జరుగుతున్న రెండో ఎస్ఎస్ఆర్ పురోగతిపై సమీక్షించారు. 18-19 ఏళ్ల మధ్య వయస్కుల ఓట‌రు నమోదు, ఓటర్ల జాబితాలో దివ్యాంగ ఓటర్లను గుర్తించడం, ట్రాన్స్‌జెండర్లు , సెక్స్ వర్కర్ల నమోదు కృషి చేయాలని అన్ని జిల్లాలకు సూచించారు.

ముఖ్యంగా 18-19 ఏళ్ల మధ్య వయసున్న యువతను ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు వివిధ ప్రచార పద్ధతులను పాటించాలని డీఈవోలు, ఏఆర్వోలు, ఏఈఆర్వోలకు సీఈవో సమగ్ర ఆదేశాలు జారీ చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచాలనీ, ఓటింగ్ శాతాన్ని పెంచాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. సీఈవో కార్యాలయం, ఈసీఐ పంపిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలనీ, జాప్యం చేయకుండా వాస్తవ నివేదికలను సీఈవో కార్యాలయానికి పంపాలని డీఈవోలను ఆదేశించారు.

click me!