అమిత్ షా సభలో ప్లెక్సీ వివాదం... ఇలాగైతే బహిష్కరిస్తామంటూ ఈటల వర్గీయులు వార్నింగ్ ?

Published : Aug 27, 2023, 08:01 AM ISTUpdated : Aug 27, 2023, 08:20 AM IST
అమిత్ షా సభలో ప్లెక్సీ వివాదం... ఇలాగైతే బహిష్కరిస్తామంటూ ఈటల వర్గీయులు వార్నింగ్ ?

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇప్పటికే కాస్త వెనకబడ్డ బిజెపిలో గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి.  అమిత్ షా పాల్గొనే ఖమ్మం సభకోసం ఏర్పాటుచేసిన ప్లెక్సీల్లో ఈటల ఫోటోలు లేకపోవడం వివాదానికి దారితీసింది. 

ఖమ్మం : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలాపడ్డ బిజెపిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జోష్ నింపేందుకు ఆ పార్టీ అదిష్టానం సిద్దమయ్యింది. ఇప్పటికే అధికార బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తే, మరో ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల వేటలో తలమునకలై వుంది. దీంతో బిజెపి అధిష్టానం కూడా రంగంలోకి దిగి కేంద్ర మంత్రి అమిత్ షా తో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది. కానీ ఈ సభ సాక్షిగా తెలంగాణ బిజెపిలో వున్న అంతర్గత విబేధాలు బయటపడ్డాయి.

నేడు(ఆదివారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ కోసం ఖమ్మంలో భారీ ఏర్పాట్లు చేసారు. 'రైతు గోస-బిజెపి భరోసా' పేరిట నిర్వహిస్తున్న ఈ సభను తెలంగాణ బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఈ సభ కోసం ఏర్పాటుచేసిన ప్లెక్సీల్లో బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫోటోలు లేకపోవడం వివాదానికి దారితీసింది. పార్టీ విజయం కోసం కష్టపడుతున్న నాయకుడికి బిజెపిలో దక్కే గౌరవం ఇదేనా అంటూ ఈటల వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అమిత్ షా సభ జరిగే మైదానంలో ఏర్పాటుచేసిన ప్లెక్సీల్లో ఈటల రాజేందర్ ఫోటోలు లేవంటూ నిర్వహణ కమిటీ సభ్యులను ఈటల వర్గీయులు నిలదీసారు. ఈటలను అవమానించేలా వ్యవహరించడం సరికాదని... ఇలాగయితే అమిత్ షా సభను బహిష్కరిస్తామని ఈటల వర్గీయులు హెచ్చరించారు. ఇలా కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ జిల్లాల నుండి ఖమ్మం చేరుకున్న ఈటల వర్గీయులు నిర్వహణ కమిటీ సభ్యులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. 

Read More  బీజేపీ, కాంగ్రెస్ లేని మూడో ప్రత్యామ్నాయం దేశానికి అవసరం: అసదుద్దీన్ ఒవైసీ

ఈ ప్లెక్సీల వివాదం ముదరకుండా నిర్వహకులు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే ఈటల ఫోటోలతో కూడిన ప్లెక్సీలు ఏర్పాటుకు సన్నద్దమయ్యారు. సభ ప్రారంభమయ్యే సమయానికి ఈ ప్లెక్సీలు కనిపించేలా నిర్వహణ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇదిలావుంటే నేడు తెలంగాణకు రానున్న అమిత్ షా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాములను అమిత్ షా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం హెలికాఫ్టర్‌లో ఖమ్మంకు చేరుకోవాల్సి వుంది. కానీ అమిత్ షా భద్రాచలం వెళ్లకుండా నేరుగా ఖమ్మం చేరుకోనున్నట్లు తెలుస్తోంది. అనివార్య కారణాల వల్ల కేంద్ర హోంమంత్రి భద్రాచలంలోని సీతారామస్వామి దర్శనానికి వెళ్లడంలేదని బిజెపి నాయకులు చెబుతున్నారు. 

నేరుగా ఖమ్మం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ బీజేపీ కోర్ కమిటీ నేతలతో భేటీ అయి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 5.45 గంటలకు ఖమ్మం నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో  అమిత్ షా అహ్మదాబాద్ వెళతారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?