Huzurabad Bypoll: మిస్టర్ హరీష్.. తప్పకుండా నీ భరతం పడతా: ఈటల స్ట్రాంగ్ వార్నింగ్

By Arun Kumar PFirst Published Sep 13, 2021, 5:50 PM IST
Highlights

ఆర్థిక మంత్రి హరీష్ రావు హుజురాబాద్ లో తనకు మద్దతుగా నిలిచే వారిపై ఇబ్బందులకు గురిచేస్తున్నాడని... తప్పకుండా ఆయన భరతం పడతానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. 

కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో తనకు మద్దతుగా నిలిచిన వారిని టీఆర్ఎస్ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని... అయినా లొంగకుంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. మంత్రి హరీష్ రావు అయితే తనకు మద్దతిస్తున్న వారిపై పోలీసులచేత క్రిమినల్ కేసులు పెట్టిస్తున్నాడని ఈటల తెలిపారు. 

హుజురాబాద్ పట్టణంలోని మధువాని గార్డెన్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో పలువురు నాయకులు, కార్యకర్తలు బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన చాలామంది పేదింటి బిడ్డలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించానని తెలిపారు. కానీ ఇప్పుడు తాను పెట్టించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

''మిస్టర్ హరీష్ రావు... నీతో పాటు నేను కూడా ఉద్యమంలో పనిచేశా. ఇటువంటి పనులు చేసి ప్రజల్లో చులకన కాకు... తప్పకుండా నీ భరతం పడతా. నీవు ఆర్థిక శాఖ మంత్రి కాదు ఓ రబ్బర్ స్టాంప్ అని గుర్తించు. దుబ్బాకలో నీ బ్రోకర్ మాటలకు కర్రు కాల్చి వాత పెట్టారు. రేపు హుజురాబాద్ లోనూ అదే జరుగుతుంది'' అంటూ ఈటల మంత్రి హరీష్ ను హెచ్చరించారు.  

''రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం వండే వాళ్లకు జీతాలు, సర్పంచులకు ఆర్థిక మంత్రిగా బిల్లులు ఇచ్చే ప్రయత్నం చేయి. నేను ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసినప్పుడు బిల్లులు ఎప్పటికప్పుడు ఇచ్చా. కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నపుడు నా చేతిలో ఏం లేదు కాబట్టి బిల్లులు రాబట్టలేక పోయాను'' అన్నారు. 

read more  Huzurabad Bypoll:ఈటల ఇలాకాలో హరీష్ హల్ చల్... భారీ ఎత్తున సంబరాలు (వీడియో)
 
''దళిత ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో దళిత బందు సంక్షేమ పథకాలు ఇస్తున్నారా?ముఖ్యమంత్రి పదవి కావాలని ఎప్పుడు ఆశించలేదు... కనీసం మనిషిగా చూడమని చెప్పాం. ముఖ్యమంత్రి చెప్పిన భూ కుంభకోణం నిజమా? ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించానన్న హరీష్ రావు మాటలు నిజమా?'' అని ఈటల నిలదీశారు.

''నా అందట నేను రాజీనామా చేయలేదు... నన్ను రాజీనామా చేయమని ప్రెస్ మీట్ లు పెట్టీ చెప్పింది మీరు. మీ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే పదవిని మీ ముఖం మీదే కొట్టి వచ్చా. మీలాగా నాకు పదవులు వారసత్వంగా రాలేదు'' అన్నారు. 

''హుజూరాబాద్ ఎవరికి ఏం ఇచ్చినా వాళ్ళ ఇండ్ల నుండి ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ పార్టీని దుష్ట పార్టీగా, నాయకులు దుష్టులుగా ప్రజలు భావిస్తున్నారు. హుజూరాబాద్ లో రెండు లక్షల ఇరవై వేల ఓట్లు ఉంటే టీఆర్ఎస్ పార్టీ మూడు లక్షల మందికి కండువాలు వేసారు'' అని ఈటల ఎద్దేవా చేశారు. 

''కరీంనగర్ సిపి టీఆర్ఎస్ కు తోత్తు కావచ్చు కానీ కానిస్టేబుళ్లు, ఎస్సై లు తొత్తులు కాదు. ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే కేంద్ర ఎన్నికల సంఘం నిఘా ఉంటుంది గుర్తు పెట్టుకో. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ్రీ ఫైనల్ లాంటిది. నేను ఒంటరి కాదు... యావత్తు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారు'' అని ఈటల అన్నారు.

''టీఆర్ఎస్ ప్రచార రథాల్లో పని చేసే వాళ్ళు కూడా ఈటలకు ఓటు వేయమంటున్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు గురి చేయకపోతే ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదు. పోలీస్ అధికారులు చట్టబద్దంగా పనిచేయకపోతే  శిక్ష తప్పదు'' అని ఈటల రాజేందర్ హెచ్చరించారు. 


 
 

 
 

click me!