తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.. బడ్జెట్‌ విషయంలో లంచ్‌‌మోషన్ పిటిషన్‌‌పై కీలక వాదనలు

By Sumanth KanukulaFirst Published Jan 30, 2023, 2:24 PM IST
Highlights

తెలంగాణ బడ్జెట్‌ను గవర్నర్ ఆమోదించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌‌మోషన్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తున్నారు.
 

తెలంగాణ బడ్జెట్‌ను గవర్నర్ ఆమోదించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతించిన హైకోర్టు.. ఈ రోజు మధ్యాహ్నం వాదనలు వినడం ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినప్పుడు కోర్టులు జోక్యం కలుగజేసుకోవచ్చని దవే అన్నారు. గవర్నర్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శి సంప్రదించారని తెలిపారు. అసెంబ్లీలో తన ప్రసంగం ఉందా అని ఆర్థిక శాఖ కార్యదర్శిని గవర్నర్ అడిగారని చెప్పారు. 

తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఈ వాదనలు వినిపిస్తున్న సమయంలోనే.. ఇలాంటి విషయాల్లో తాము కలుగజేసుకుంటే.. కోర్టు పరిధి దాటి వ్యవహరిస్తోందని మీరే అంటారంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి తదుపరి విచారణను హైకోర్టు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. 

ఇక, అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్‌కు గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ఇప్పటివరకు ఆమోదం తెలుపకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టులో లంచ్‌‌మోషన్ పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. బడ్జెట్‌ను  ఆమోదించేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అంగీకరించింది. అయితే ఈ సందర్బంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య జరుగుతున్న ఈ విషయంలో తామేలా జోక్యం చేసుకుంటామని ప్రశ్నించింది. ఈ విషయంలో గవర్నర్‌కు కోర్టు నోటీసు ఇవ్వగలదా?.. కోర్టులు మితిమీరి జోక్యం చేసుకుంటాయని మీరే అంటారు కదా? అని అడ్వొకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. ఈ సందర్భంగా బడ్జెట్‌కు ఆమోదం  లభించకపోతే.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఏజీ చెప్పినట్టుగా తెలుస్తోంది. 

click me!