బీజేపీ నాయకత్వాన్ని ధిక్కరించేలా తాను వ్యాఖ్యలు చేయలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు.ఈ వార్తలను ఉపసంహరించుకోవాలని ఆయన మీడియాను కోరారు.
న్యూఢిల్లీ: తాను పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించేవాడిని కాదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. సోమవారంనాడు న్యూఢిల్లీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. తాను క్రమశిక్షణ గల కార్యకర్తగా రఘునందన్ రావు చెప్పారు. పార్టీ కోసం పదేళ్లుగా శ్రమిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. పదవులున్నా ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేస్తున్నానని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో దుబ్బాక నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధిస్తానని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని తపించే వ్యక్తిగా రఘునందన్ రావు తెలిపారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి కోసమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసేందుకు వచ్చినట్టుగా ఆయన చెప్పారు.
బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని, హైకమాండ్ ను ధిక్కరించేలా తాను వ్యాఖ్యలు చేయలేదని రఘునందన్ రావు వివరణ ఇచ్చారు. తాను ఢీల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. బీజేపీ నాయకత్వాన్ని ధిక్కరించేలా తాను వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రసారం చేసిన మీడియా సంస్థలు ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. తాను చేయని వ్యాఖ్యలను చేసినట్టుగా మీడియాలో ప్రసారం చేయడం సరికాదన్నారు. రఘునందన్ రావు, కమలం గుర్తు వేర్వేరు కాదన్నారు. గతంలో కూడ ఇదే విషయాన్ని తాను ప్రకటించినట్టుగా రఘునందన్ రావు గుర్తు చేశారు. స్వార్థం కోసం తాను ఏనాడూ వ్యాఖ్యలు చేయలేదన్నారు.
రెండు నెలలుగా తాను తన నియోజకవర్గానికే పరిమితమైనట్టుగా రఘునందన్ రావు తెలిపారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని రఘునందన్ రావు స్పష్టం చేశారు. పార్టీలో పదవులు రావాలని కోరుకోవడం తప్పు కాదన్నారు.
also read:నా గెలుపు చూసే బీజేపీలోకి ఈటల.. బండి సంజయ్‌కు అంత డబ్బు ఎక్కడిది?: రఘనందన్‌రావు సంచలనం
న్యూఢిల్లీలో మీడియాతో రఘునందన్ రావు చిట్ చాట్ ఇవాళ చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా మీడియా రిపోర్టు చేసింది. ఈ వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రఘునందన్ రావు వివరణ ఇచ్చారు.