
హైదరాబాద్ శంషాబాద్ (Shamshabad) పరిధిలో ఓ యువతి మద్యం మత్తులో బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో కారు నడిపిన యువతి (Drunken Woman) హల్‌చల్ చేసింది. రోడ్డుపై వెళ్తున్నవారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వివరాలు.. మద్యం మత్తులో కారు నడిపిన యువతి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బస్తాండ్ వద్ద అటుగా నడుచుకుంటూ వెళ్తున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు యువతి కారును అడ్డగించి ఆమెతో వాగ్వాదానికి దిగారు.
అయితే యువతి మాత్రం కారును ఆపిన స్థానికులపై దుర్భాషలాడింది. తనకేమి తెలియదన్నట్టుగా ప్రవర్తించింది. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతి కారులో మద్యం బాటిల్స్ ఉండటం గమనార్హం. కారుతో సహా యువతిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. మరోవైపు గాయపడిన ముగ్గురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.