బండి సంజయ్‌ ఫిర్యాదు: విచారణకు హాజరవ్వాలని డీవోపీటీ, కేంద్ర హోంశాఖకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలు

By Siva KodatiFirst Published Jan 27, 2022, 2:24 PM IST
Highlights

తెలంగాణ బీజేపీ  అధ్యక్షుడు  బండి సంజయ్ అరెస్ట్‌కు సంబంధించి డీవోపీటీ, కేంద్ర హోంశాఖకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమీటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 3న కమిటీ ముందు హాజరవ్వాలని ఆదేశాలలో తెలిపింది. 

తెలంగాణ బీజేపీ  అధ్యక్షుడు  బండి సంజయ్ అరెస్ట్‌కు సంబంధించి డీవోపీటీ, కేంద్ర హోంశాఖకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమీటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 3న కమిటీ ముందు హాజరవ్వాలని ఆదేశాలలో తెలిపింది. 

అంతకుముందు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి‌ రవి గుప్తాలతో పాటుగా మరికొందరు అధికారులకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ (lok sabha privileges committee) జనవరి 22న నోటీసులు పంపింది. బండి సంజయ్‌ (Bandi Sanjay) ఫిర్యాదు మేరకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ఈ నోటీసులు పంపింది. ఫిబ్రవరి 3వ తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ నోటీసుల్లో పేర్కొంది. సీఎస్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి‌లతో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణలకు కూడా ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపింది. అంతేకాకుండా ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ ఇన్‌స్పెక్టర్‌లకు సైతం కమిటీ నోటీసులు జారీ చేసింది. 

ఇక, ఎంపీగా ఉన్న తన విధులకు అడ్డు తగిలి, తనపై దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్‌ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న పోలీసుల‌ కస్టడీ ఉన్న‌ప్పుడే లోక్ స‌భ‌ స్పీకర్‌కు లేఖ రాశారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని, పోలీసులు తన ప‌ట్ల వ్యవహరించిన తీరును వివ‌రిస్తూ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరైన బండి సంజయ్‌ తన వాదనలు వినిపించారు. 

తన ఇంటిపై పోలీసులు దౌర్జన్యాన్ని, అరెస్టును తెలంగాణ హైకోర్టు కూడా తప్పుపట్టిన విషయాన్ని బండి సంజయ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. తనను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ, ఇతర పోలీసులు తనపై దాడి చేయడం ఇది రెండోసారని కమిటీకి వివరించారు. గతంలో ఆర్టీసీ కార్మికుడు నగునూరు బాబు అంత్యక్రియలకు వెళ్లడానికి ప్రయత్నించినపుడు పోలీసులు అడ్డుకొని తనపై క్రూరంగా దాడికి పాల్పడినట్లు చెప్పారు. 

ఈ నెల 2వ తేదీన కరీంనగర్‌లోని తన కార్యాలయంలో కొవిడ్‌ నిబంధనలనూ అనుసరిస్తూ తలపెట్టిన జాగరణ కార్యక్రమంపైనా పోలీసులు దాడి చేయడంతో పాటు అక్రమంగా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. ఆ రోజు కరీంనగర్ సీపీ సత్యనారాయణ, హుజూరాబాద్‌ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి, జమ్మికుంట ఇన్‌స్పెక్టర్‌ కొమ్మినేని రాంచందర్‌రావు, హుజూరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ వీ శ్రీనివాస్, కరీంనగర్‌ సీసీఎస్‌ ఏసీపీ కె శ్రీనివాస్, కరీంనగర్‌ టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ చల్లమల్ల నరేశ్‌ సహా గుర్తు తెలియని ఇతర పోలీస్‌ సిబ్బంది దాడి చేశారని కమిటీకి వివరించారు. ఇందుకు సంబంధించి కొన్ని వీడియోలను కూడా ఆయన కమిటీకి అందజేశారు. తన హక్కులకు భంగం కలింగించేలా వ్యవహరించిన వీరిపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు. 

click me!