
కరీంనగర్ : మద్యం మత్తుకు ఎన్నో జీవితాలు చిత్తవుతున్నాయి. ఇళ్లు, ఒళ్లు హూనం అవుతున్నా సరే మద్యం మత్తును వీడటంలేదు తాగుబోతులు. ఇక కొందరికయితే మందు తాగడం... ఆ మత్తులో గొడవలు పడటమే పని. ఇలాంటి కొందరు మందుబాబులు వైన్ షాప్ వద్ద బీర్ సీసాలతో కొట్టుకుని ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో చోటుచేసుకుంది.
బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామానికి చెందిన తిరుపతి గౌడ్ మరికొందరితో కలిసి మద్యం సేవించాడు. ఈ మత్తులోనే తిమ్మాపూర్ లోని వైన్ షాప్ వద్దకు వెళ్లాడు. మద్యం కొనుగోలు విషయంలో ఇతడికి మరొకరితో గొడవ జరిగింది. ఇద్దరూ మత్తులోనే వుండటంతో మాటామాటా పెరిగి పెద్ద గొడవకు దారితీసింది. మత్తులో విచక్షణ కోల్పోయిన ఇద్దరు బీర్ సీసాలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
Read More పెళ్లి చేయడం లేదని తల్లిని గొంతుకోసి చంపి, కాళ్లు నరికి.. దొంగలపని అని నమ్మించే ప్రయత్నం
మందుబాబుల వీరంగంతో వైన్ షాప్ వద్ద రక్తపాతం జరిగింది. బీర్ సీసాల దాడిలో తిరుపతి గౌడ్ తలపగలడంతో ఒళ్లంతా రక్తంతో తడిసిపోయింది. దీంతో అతడిని స్థానిక హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు సమాచారం.
మందుబాబుల గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు వైన్ షాప్ వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. బీర్ సీసాలతో దాడులు చేసుకున్న ఇద్దరు మందుబాబుల వివరాలను సేకరించారు. ఈ గొడవపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.