
తెలంగాణ సర్కార్ దళిత బంధు (Dalit Bandhu) పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి, హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమల్లోకి తెచ్చారు. రాష్ట్రంలోని మరో నాలుగు మండలాలను కూడా దళిత బంధుకు ఎంపిక చేశారు. అయితే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని హుజురాబాద్ ఉప ఎన్నికకు (Huzurabad Bypoll) ముందే అమలు చేయడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. కేవలం హుజురాబాద్ కోసమే కేసీఆర్ ఈ డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించాయి. అయితే వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఖండించారు. దళిత బంధు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన Dalit Bandhu scheme హుజురాబాద్ ఎన్నికల్లో తమను గట్టేక్కిస్తుందని టీఆర్‌ఎస్ శ్రేణులు భావించాయి.
ఇదిలా హుజురాబాద్‌లో ఉప ఎన్నిక ముగిసే వరకు దళిత బంధు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో అధికారులు అక్కడ దళిత బంధు అమలును నిలిపివేశారు. అయితే ఈ సమయంలో టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఎన్నిక పూర్తికాగానే.. నవంబర్ 4వ తేదీ నుంచి దళిత బంధు పథకాన్ని పునురుద్దరించనున్నట్టుగా ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు కుట్రపూరితంగా దళిత బంధును అడ్డుకున్నాయని ఆరోపించారు గులాబీ బాస్.
Also read: దళిత బంధు అమలు కోరుతూ ఈ నెల 9న బీజేపీ ఆందోళనలు
ఈసీ కేవలం ఎన్నిక పూర్తయ్యే వరకే దళిత బంధును ఆపగలుగుతుందని.. నవంబర్ 4 నుంచి దళితబంధును ఆపడం ఎవరి తరం కాదని అన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం సాధించి.. దళిత బంధును అందజేస్తాడని చెప్పుకొచ్చారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల వెల్లడి తర్వాత.. దళిత బంధు పథకం అమలుపై సందిగ్దత నెలకొంది. సీఎం కేసీఆర్ దళిత బంధు సభ ఏర్పాటు చేసిన శాలపల్లిలోనే TRSకు భారీ షాక్ తగిలింది. ఆ గ్రామంలో టీఆర్‌ఎస్ కన్నా బీజేపీకే ఎక్కువగా ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్(Etela Rajender) విజయం సాధించడంతో.. కేసీఆర్ మాట ఇచ్చినట్టుగానే దళిత బంధు అమలు చేస్తారా..? అనే చర్చ ఇప్పుడు తెలంగాణ ప్రజానీకంలో జోరుగా సాగుతుంది. శాలపల్లిలో ఓటమితో ఖంగుతిన్న టీఆర్‌ఎస్ ఈ పథకాన్ని కొనసాగిస్తుందా..? అనే అనుమానాలు కూడా వ్యక్తమతున్నాయి.
టీఆర్‌ఎస్ ప్లీనరీ (TRS plenary) వేదికగా నవంబర్ 4 నుంచి దళిత బంధు పునఃప్రారంభించనున్నట్టుగా కేసీఆర్ ప్రకటన చేసినప్పటికీ.. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అనేది లేకుండా పోయింది. దీంతో దళిత బంధు అమలుపై అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి ప్రతిపక్షాలు కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు సంధిస్తున్నాయి. హామీ ఇచ్చిన విధంగా దళిత బంధును అమలు చేయడంతో ప్రభుత్వం విఫలమైతే తాము ఆందోళన చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Also read: హుజురాబాద్ ఫలితాలు కేసీఆర్ నెక్ట్స్ ఏం చేయనున్నారు.. ముందస్తు ఎన్నికలకు వెళ్తారా..?
ఇదివరకు ఏం జరిగింది..
హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు.. సీఎం కేసీఆర్ దళితుల కుటుంబాలు ఎదుగుదల కోసం ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు అందచేయడానికి దళిత బంధు పథకానికి శ్రీకారం చూట్టారు. Huzurabad Assembly constituencyని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంచుకుని 20 వేలకు పైగా లబ్దిదారులను గుర్తించారు. దశలవారీగా నిధులు కూడా విడుదల చేశారు. ఈ పథకంతో దేశం మొత్తం హుజురాబాద్ వైపు చూస్తుందని కామెంట్స్ కూడా చేశారు. హుజురాబాద్ అనంతరం రాష్ట్రం మొత్తం ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత మరో నాలుగు మండలాలు.. మధిర నియోజకవర్గంలోని చింతకాని, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి, అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌లను దళిత బంధు కోసం ఎంపిక చేసినట్టుగా ప్రకటించారు. ఈ నాలుగు మండలాలకు ప్రభుత్వం రూ. 250 కోట్లు విడుదల చేసింది.
Also read: ఈటల చివరి వరకు బీజేపీలో వుండరు.. రేవంత్‌కేమో సీనియర్ల సెగ : కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలు
అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో దళిత బంధు పథకాన్ని నిలిపివేయాలని ఎన్నికల సంఘం అక్టోబర్ 19న ఆదేశాలు జారీచేసింది. ఆ సమయానికి ప్రభుత్వం 17,000 లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసింది. మిగిలిన 3,000 కుటుంబాలకు నిధులు విడుదల ఆగిపోయింది. అయితే నవంబర్ 4 నుంచి వారికి దళిత బంధు అందివ్వనున్నట్టుగా కేసీఆర్ ప్రకటించినప్పటికీ.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తేనే ఇందుకు సంబంధించి స్పష్టత రానుంది.
వ్యతిరేకిస్తున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..!
దళిత బంధు పథకం తీసుకొచ్చిన తర్వాత మిగిలిన కులాల వారి నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. కొందరు బహిరంగగానే కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే మిగతా కులాల వారికి కూడా ఇటువంటి పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్ వినిపించింది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమి తర్వాత.. పలువురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా దళిత బంద్ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ పథకం కారణంగా టీఆర్‌ఎస్‌పై ఇతర కులాల్లో ఆగ్రహం పెరిగిందని.. ఇదే పార్టీ అభ్యర్థి ఓటమికి కారణమైందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఒకవేళ దళిత బంధు పథకాన్ని కనుక ప్రభుత్వం కొనసాగించాలనే భావిస్తే.. ఇదే తరహాలో ఏకకాలంలో బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, ఓసీలోని పేదలకు కూడా పథకాన్ని తీసుకురావాలని అంటున్నారు.