Double Bedroom Houses Inauguration: సొంత జిల్లాలోనే మంత్రి గంగులకు నిరసన సెగ... మహిళల ఆందోళన

By Arun Kumar PFirst Published Dec 19, 2021, 2:47 PM IST
Highlights

కరీంనగర్ జిల్లాలోని  కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్దిదారులకు అందించారు మంత్రి గంగుల. ఈ సందర్భంగా కొందరు మహిళలు మంత్రి ఎదుటే ఆందోళనకు దిగారు. 

కరీంనగర్: సొంత జిల్లా కరీంనగర్ (karimnagar) లోనే మంత్రి గంగుల కమలాకర్ (gangula kamalakar) కు మహిళల నుండి నిరసన సెగ తగిలింది. జిల్లాలోని ఓ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవానికి వెళ్లిన మంత్రి ఎదుటే కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో మంత్రితో పాటు కలెక్టర్, పోలీస్  అధికారులు మహిళలను సముదాయించారు. 

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్ పూర్ (kamanpur) గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ (double bedroom) ఇళ్లను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. గ్రామానికి చెందిన గూడులేని నిరుపేదల కోసం 421.43 లక్షల వ్యయంతో టీఆర్ఎస్ ప్రభుత్వం 67 ఇళ్లను నిర్మించింది. వాటిలో నిర్మాణం పూర్తయిన 56 ఇళ్లను లబ్ధిదారులకు డ్రా పద్ధతి లో ఎంపిక చేసి పంపిణీ చేశారు. 

Video

ఈ క్రమంలోనే ఇవాళ(ఆదివారం) మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ లబ్ధిదారులచేత గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల ఎదుటే కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని... అర్హులను ఎంపిక చేయలేదంటూ ఆందోళనకు దిగారు.

read more  హైదరాబాద్: పేకాట స్థావరం గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్, నిందితుల్లో మహిళా కార్పోరేటర్ల భర్తలు

దీంతో మంత్రి గంగుల ఆందోళన చేస్తున్న మహిళలతో మాట్లాడారు. అర్హులైన వారందరికీ ఇళ్లను మంజూరయ్యేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే కలెక్టర్, పోలీస్ అధికారులు కూడా మహిళలను సముదాయించడంతో వారు ఆందోళనను విరమించుకున్నారు.  

ఈ డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి గంగుల మాట్లాడుతూ....  ఇళ్లను పొందిన లబ్ధిదారులు వాటిలోనే నివాసం ఉండాలని... ఇంటిని అమ్మినా, ఇతరులకు అద్దెకిచ్చినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. కేటాయించిన ఇళ్లకు 5 రోజుల్లో పట్టాలు ఇస్తామంటూ మంత్రి గంగుల హామీ ఇచ్చారు.

డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపుతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండాయని మంత్రి అన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు విద్యుత్ మీటర్లు, త్రాగునీటి సరఫరా కల్పించినట్లు ఆయన అన్నారు. నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ల సొంత ఇండ్ల  కల సాకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తండ్రి లాంటి వారని... దైవంతో సమానమని అన్నారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రి గంగుల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు.

కమాన్ పూర్ గ్రామం రాములపల్లిలో 47 కుటుంబాలు ఎల్.ఎం.డి ముంపుకు దగ్గరగా ఉన్నాయని... వారికి రిహాబిలిటేషన్ కింద ఇండ్లు కేటాయించామని ఆయన తెలిపారు. 47 మందిలో 36 కుటుంబాలకు ఆదివారం డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించామని... మిగిలిన 11 మందికి గ్రామసభ ద్వారా అధికారులు కేటాయిస్తారని ఆయన తెలిపారు. 

మిగిలిన డబుల్ బెడ్ రూం ఇండ్లను కమాన్ పూర్ గ్రామస్తులకు లాటరీ ద్వారా కేటాయించామని, వారందరూ ఆదివారం కుటుంబ సభ్యులతో సహా సంతోషంగా గృహప్రవేశాలు చేశారని మంత్రి తెలిపారు. రాములపల్లి గ్రామస్తులు గృహాలను వెంటనే ఖాళీ చేసి నూతంగా కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి వెంటనే మారాలని మంత్రి గంగుల కోరారు. 


 

click me!