
కరీంనగర్: రాబోయే రోజుల్లో విద్య, వైద్య వ్యవస్థను బలోపేతం చేసే అలోచనలో సీఎం కేసీఅర్ ఉన్నారని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యపై పెట్టే ఖర్చు ఇతర రాష్ట్రాల కంటే చాలా ఎక్కువని హరీష్ అన్నారు. రాబోయే రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన ప్రైవేట్ ఉపాద్యాయులకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని ప్రకటించారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల్లో ప్రైవేట్ టీచర్లను భాగస్వాములు చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.
హుజురాబాద్ లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సెప్టెంబర్ 5 అంటే అందరికీ గుర్తు వచ్చేది గురు పుజోత్సవమేనని అన్నారు. తల్లిదండ్రుల తరువాత గౌరవం ఇచ్చేది గురువులకు మాత్రమేనని... మనల్ని ఓ స్థాయికి తీసుకొచ్చేది గురువులేనని అన్నారు. ఒక ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించి రాష్ట్రపతి స్థాయికి వెళ్ళారు సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం అని గుర్తుచేశారు. గురు పూజోత్సవం సందర్భంగా ఇంత మంది గురువులను సన్మానం చేసే అవకాశం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు మంత్రి హరీష్.
''కరోనా ముందు ప్రపంచ దేశాలు మొకరిల్లాయి. కరోనా చాలా రంగాల్లో ప్రభావం చూపెట్టింది. ప్రత్యక్ష బోధనలో వున్నట్లు ఆన్లైన్ లో బోధన ఉండదు. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితులు నెలకొంటున్నాయి'' అన్నారు.
read more చదువే తరగని ఆస్తి, గురువే రూపశిల్పి..: టీచర్స్ డే సందర్భంగా సీఎం జగన్ (వీడియో)
''రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. 92శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా నోటిఫికేషన్లు ఇస్తాం. రాష్ట్రంలో ఇంకా అరవై వేల ఉద్యోగులు ఖాళీగా ఉన్నాయి.వాటన్నింటిని భర్తీ చేస్తాం'' అని హరీష్ రావు వెల్లడించారు.
''గతంలో రైతుల ఆత్మహత్యలు ఉండేవి... ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. తెలంగాణ లో విద్యుత్ సమస్యను కేవలం తొమ్మిది నెలల్లో అధిగమించి ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఇచ్చే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు విద్యా వ్యవస్థ పై ముఖ్యమంత్రి కేసీఅర్ దృష్టి పెడుతున్నారు'' అని పేర్కొన్నారు.
''పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చేది కేవలం తెలంగాణ రాష్ట్రమే. పాఠశాల లు ప్రారంభం అయినందున బ్యాంకులతో మాట్లాడి ప్రైవేట్ స్కూళ్లకు సహాయం అందేలా చూస్తాం. హుజూరాబాద్ లో విద్యార్థుల భవిష్యత్తు లో బాగు పడాలంటే టీఆర్ఎస్ కు ఓటు వేయండి. సెంటిమెంట్ కాదు హుజూరాబాద్ కు అభివృద్ది కావాలి. న్యాయం ధర్మం విశ్లేషించి ధర్మం వైపు నిలబడండి'' అని ప్రైవేట్ టీచర్స్ కు మంత్రి హరీష్ రావు సూచించారు.