దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డికి చెందిన కోటిన్నర విలువైన పోర్షేకారు చోరీ అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు గంటలోపే కారు పట్టుకున్నారు.
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో చోరీ జరిగింది. దిల్ రాజు అల్లుడికి చెందిన కోటిన్నర విలువైన కారును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే రంగంలోకి దిగి గంట సమయంలోనే కారును పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే… శుక్రవారం ఉదయం ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని దస్పల్లా హోటల్ కు వెళ్ళాడు. ఆయనకు రూ.1.7 కోట్ల విలువైన పోర్షే కారు ఉంది.
ఆ కారులోనే హోటల్ కి వెళ్లిన అర్చిత్ రెడ్డి.. 40 నిమిషాల పాటు హోటల్లో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చారు. వచ్చి చూసేసరికి ఆయన కారు కనిపించలేదు. వెంటనే జూబ్లీహిల్స్ల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న డీఐ వీర శేఖర్, డిఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వెంటనే కేసును దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. వారి దర్యాప్తులో అర్చిత్ రెడ్డి కారు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర సిగ్నల్ జంప్ చేసినట్లుగా తేలింది.
హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సందీప్ శాండిల్య
కారును దొంగిలించిన వారు అటుగా వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే కెబిఆర్ పార్క్ ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేశారు. కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే కారును ఆపి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కారులో పట్టుబడిన వ్యక్తి చెప్పిన కథ విని నమ్మాలో, వద్దో అర్థం కాక ఆశ్చర్యపోయారు. నిందితుడు తాను ఆకాశ్ అంబానీ వ్యక్తిగత సహాయకుడినని చెప్పుకొచ్చాడు.
కేటీఆర్ కారు తీసుకెళ్లాలని సూచించారని, తన సహాయకుడు హృతిక్ రోషన్, తాను కలిసి ఆకాశ్ అంబానీని కలవడానికి ఆ కారులో వెళ్లాల్సి ఉందంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. అతని దగ్గర దొరికిన వ్యక్తిగత సమాచారాలతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదంటూ కుటుంబసభ్యులు తెలిపారు.
దీనికోసం అతడికి బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ సంస్థలో చికిత్స చేయించినట్లుగా కూడా తెలపడంతో, విచారణలో అది నిజమే అని తేలింది. నిందితుడిని మల్లెల సాయికిరణ్ గా.. మన్సూరాబాద్ ప్రాంతవాసిగా గుర్తించారు.