
హైదరాబాద్ : బీజేపీ ఎంపీ అరవింద్ కు టైం బ్యాడ్ నడుస్తున్నట్టుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో వివాదం.. బీఆర్ఎస్ తో గొడవలు.. తాజాగా పసుపుబోర్డు అంశం ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండేళ్ల కిందటి నాటి ఓ కేసు పంటికింద రాయిలా మారనుంది. ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండడంతో ముందస్తు బెయిల్ కోసం అరవింద్ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును గురువారం ఆశ్రయించారు. ఈ సంఘటన అక్టోబర్ 31, 2021 నాటిది. అప్పుడు చంచల్‌గూడ జైలులో ఉన్న క్యూ-న్యూస్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్నపై దాఖలైన కేసుల గురించి అరవింద్ మాట్లాడుతూ - ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టం కింద పెండింగ్‌లో ఉన్న ఒక "లొట్టాపిసు" కేసును కూడా క్లియర్ చేస్తామని చెప్పారు. అయితే, ఈ కేసును "లొట్టాపీసు" అని తీసేయడం మీద అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు..: నిజామాబాద్ లో రాత్రికి రాత్రే ప్లెక్సీలు
దీనిమీద బంగారు సాయిలు అనేవ్యక్తి ఫిర్యాదు మేరకు మండన్నపేట పోలీసులు అరవింద్‌పై ఐపీసీ సెక్షన్ 290, 501, ఎస్సీ, ఎస్టీ (పీఓఏ) చట్టంలోని సెక్షన్ 3(1)(7) కింద కేసు నమోదు చేశారు. అరవింద్ ఎస్సీ, ఎస్టీల ఆత్మగౌరవాన్ని కించపరిచారని, ఆ ప్రకటన కించపరిచేలా ఉందని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో, అరవింద్‌కు హైకోర్టు నుండి మధ్యంతర ఉపశమనం లభించింది. ఇది ఎటువంటి చర్య తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అయితే, మధ్యంతర ఉత్తర్వులను ఇటీవల కోర్టు వెకేట్ చేసింది. ఒక ప్రజా ప్రతినిధి పదాలను ఉపయోగించడంలో జాగ్రత్తగా ఉండాలని తెలుపుతూ ఈ కేసులో చర్య తీసుకోవడానికి పోలీసులను అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ కోసం అరవింద్ కోర్టును ఆశ్రయించారు.