ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు..: నిజామాబాద్ లో రాత్రికి రాత్రే ప్లెక్సీలు (వీడియో)

By Arun Kumar PFirst Published Mar 31, 2023, 10:01 AM IST
Highlights

ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు అంటూ నిజామాబాద్ లో పసుపు రంగులో ప్లెక్సీలు వెలిసాయి. 

నిజామాబాద్ :తెలంగాణలో అధికార బిఆర్ఎస్, ప్రతిపక్ష బిజెపి ల మధ్య ప్లెక్సీ వార్ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగడుతూ రాజధాని హైదరాబాద్ లో బిఆర్ఎస్ నాయకులు ప్లెక్సీలు,వాల్ పోస్టర్లు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్లెక్సీ వార్  నిజామాబాద్ జిల్లాకు పాకింది. పసుపు బోర్డు ఏర్పాటు గురించి స్థానిక బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ను  వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్న ప్లెక్సీలు నిజామాబాద్ లో వెలిసారు. 

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు ప్రతిపాదనే లేదని కేంద్ర వాణిఝ్య శాఖ మంత్రి అనుప్రియా పాటిల్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. గురువారం బిఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేత, రంజిత్ రెడ్డి, కవిత అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. దేశంలో ఎక్కడా కూడా పసుపు బోర్డు కాదు మరే మసాలా దినుసులకు సంబంధించిన బోర్డు ప్రతిపాదన పరిశీలనలో లేదంటూ కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. సుగంధ ద్రవ్యాల బోర్డు చట్టం-1986 ప్రకారం  పసుపు, కొత్తిమీర, మిరపకాయ వంటి 52 సుగంధ ద్రవ్యాలను ప్రోత్సహించే బాధ్యత రాష్ట్రాలకు అప్పగించినట్లు అనుప్రియ పటేల్ స్పష్టం చేసారు. 

కేంద్ర మంత్రి ప్రకటనతో పసుపు బోర్డు ఏర్పాటుపై మరోసారి వివాదం రాజుకుంది. పసుపు బోర్డు ఏర్పాటుచేసేలా చూస్తానంటూ బాండ్ పేపర్ రాసిచ్చిన ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా నిజామాబాద్ లో రాత్రికి రాత్రే  ప్లెక్సీలు వెలిసారు. గుర్తుతెలియని వ్యక్తులు నగరంలో అక్కడక్కడా పసుపు రంగు ప్లెక్సీలను ఏర్పాటుచేసి 'ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు' అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.   

వీడియో

నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్లెక్సీల ఏర్పాటు బిఆర్ఎస్ పనే అని బిజెపి ఆరోపిస్తోంది. పసుపు రైతులు స్పైసెస్ బోర్డ్ ఏర్పాటుతో సంతృప్తిగా వున్నారని... బిఆర్ఎస్ నాయకులు రాజకీయాల కోసమే పసుపు బోర్డు అంశాన్ని వాడుకుంటున్నారని అన్నారు. సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యులుగా నియమితులైన ఎంపీ అర్వింద్ పసుపు రైతులకు మేలుచేసే చర్యలు చేపట్టారని బిజెపి నాయకులు అంటున్నారు. 

గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో పసుపు రైతులు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. భారీగా నామినేషన్లు వేసి పోటీలో నిలిచి సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఓటమికి కారణమయ్యారు. ఇదే క్రమంలో కేంద్రాన్ని ఒప్పించి పసుపు బోర్డు తెస్తానంటూ బాండ్ పేపర్ రాసిచ్చి మరీ హామీ ఇచ్చిన బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను గెలిపించారు. అయితే ఎంపీగా ఎన్నికైన తర్వాత పసుపు బోర్డు ప్రతిపాదననే అరవింద్ మరిచారంటూ... స్పైసెస్ బోర్డుతో సరిపెట్టుకోవాలి అన్నట్లుగా మాట్లాడుతున్నాడని రైతులు వాపోతున్నారు. 

click me!