ఢిల్లీ లిక్కర్ స్కాంంలో హైద్రాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ పేరు తెరమీదికి వచ్చింది.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైద్రాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ పేరు తెరమీదికి వచ్చింది. హైద్రాబాద్ కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు కు ప్రవీణ్ సన్నిహితుడిగా ఉన్నాడు. ఈడీ చార్జీషీట్ లో ప్రవీణ్ పేరు నమోదు చేశారు.. ప్రవీణ్ కుమార్ పాత్రపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలో ప్రవీణ్ కుమార్ నివాసంలో ఈడీ అధికారులు రూ. 24 లక్షలు సీజ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో దుబాయ్ కంపెనీతో పాటు ఫై కంపెనీకి నిధులు మళ్లించారని అభియోగాలున్నాయని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కు చెందిన హైద్రాబాద్ కేంద్రంగా ఈడీ, సీబీఐ అధికారులు గతంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. ఈ పత్రాల ఆధారంగా దర్యాప్తు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రవీణ్ పేరు తెరమీదికి రావడంతో ఈ కేసులో మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంతో ప్రవీణ్ కుమార్ కు ఏ మేరకు సంబంధాలున్నాయనే విషయమై ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బీఆర్ఎస్ నేతలకు సంబంధం ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. గతంలో ఈడీ అరెస్టైన దినేష్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది. దీంతో ఈ కేసులో సమాచారం కొరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను సీబీఐ అధికారులు సమాచారం తీసుకున్నారు. 160 సెక్షన్ కింద నోటీసులు అందించి కమిత నుండి సమాచారం సేకరించారు. అదే రోజున మరో నోటీసును కూడా కవితకు సీబీఐ అధికారులు అందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు విచారించారు. మనీష్ సిసోడియా నివాసం, కార్యాలయం, బ్యాంకుల్లో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం ను అడ్డు పెట్టుకొని రాజకీయంగా తమపై బురదచల్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆప్ ఆరోపించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏమీ నిరూపించలేరని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.