గోడ దూకి.. కారెక్కిన నేతలకు వింత సమస్య

By sivanagaprasad kodatiFirst Published Nov 15, 2018, 11:43 AM IST
Highlights

అధికారం కోసమో.. బెదిరింపులకు భయపడో.. మరో తాయిలం కోసం పార్టీ మారిన జంపింగ్‌ జలానీలు ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో వింత సమస్యను ఎదుర్కొంటున్నారు. 

అధికారం కోసమో.. బెదిరింపులకు భయపడో.. మరో తాయిలం కోసం పార్టీ మారిన జంపింగ్‌ జలానీలు ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో వింత సమస్యను ఎదుర్కొంటున్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సొంతంగా 63 స్థానాలను గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది.

ఆ తర్వాత తన అధికారాన్ని సుస్ధిరం చేసుకునేందుకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించి.. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలను కారెక్కించుకున్నారు. 

తాజా ఎన్నికల్లో సిట్టింగులందరికీ సీట్లు కేటాయించిన కేసీఆర్.. జంప్ జిలానీలకు కూడా అవకాశం కల్పించారు. ఇక్కడే గోడ దూకిన నేతలకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఏ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరామో.. ఆ పార్టీతోనే,  గత ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేశామో అదే నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలోకి దిగాల్సి రావడం వాళ్లకు ఎక్కడో గుచ్చుతున్నట్లుగా ఉంది. 

ఉదాహరణకు, 2014 ఎన్నికల్లో శేరిలింగపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అరికెపూడి గాంధీ తర్వాత కాలంలో టీఆర్ఎస్‌లో చేరారు. తాజా ఎన్నికల్లో అదే శేరిలింగంపల్లి స్థానంలో పోటీ చేస్తున్న గాంధీ.. తన సొంతపార్టీతో తలపడుతున్నారు. 

అలాగే ముధోల్‌లో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన జి.విఠల్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు..ప్రస్తుత ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచే బరిలోకి దిగి... కాంగ్రెస్‌ అభ్యర్థి రామారావు పటేల్‌తో పోటీ పడుతున్నారు. కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన మాధవరం కృష్ణారావు అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక్కడి నుంచి మళ్లీ పోటీ చేస్తున్న ఆయన తెలుగుదేశం అభ్యర్థి తన మాజీ మిత్రుడు పెద్దిరెడ్డిని ఎదుర్కొబోతున్నాడు. 

డోర్నకల్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచిన మాజీ మంత్రి రెడ్యా నాయక్ అనంతరం టీఆర్ఎస్‌లో చేరారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థితో పోటీపడనున్నారు.. 

మిర్యాలగూడ నుంచి గెలిచిన కాంగ్రెస్ నేత నల్లమోతు భాస్కరరావు తదనంతర కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆయన తన పాత పార్టీని ఎదుర్కొబోతున్నారు. ఇక్కడి నుంచి తన కుమారుడిని బరిలోకి దింపేందుకు సీనియర్ నేత జానారెడ్డి పావులు కదుపుతున్నారు. 

ములుగు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన దాసరి అనసూయ... టీఆర్ఎస్ అభ్యర్ధి, మంత్రి చందూలాల్‌ చేతిలో ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆమె ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి చందులాల్‌ను ఢీకొట్టబోతున్నారు. పైన పేర్కొన్నవారు మచ్చుకు కొన్ని మాత్రమే.. ఇంకా చాలా మంది నేతలు ఇదే రకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 

click me!