డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో జరిగిన అగ్ని ప్రమాదంతో ఆ భవనాన్ని కూల్చివేస్తే ఇతర భవనాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిట్ డైరెక్టర్ రమణారావు అనుమానం వ్యక్తంచేశారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ నైట్ వేర్ భవనాన్ని కూలిస్తే పక్కనున్న భవనాలకు నష్టంవాటిల్లే అవకాశం ఉందని వరంగల్ నిట్ డైరెక్టర్ రమణారావు అభిప్రాయపడ్డారు. డెక్కన్ నైట్ వేర్ స్టోర్స్ లో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదం జరిగిన స్థలాన్ని శుక్రవారం నాడు నిట్ డైరెక్టర్ రమణారావు పరిశీలించారు. మంటల ధాటికి భవనం బలహీనపడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ భవనంపై ఏం చేయాలనే దానిపై ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. దీనిపై నివేదిక తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవాళ ఉదయం కూడా ఈ భవనంలోని సెల్లార్ లో మంటలు వస్తున్నాయి.ఈ మంటలను కూడా అదుపు చేస్తున్నారు. ఈ మంటలను అదుపు చేసే క్రమంలో ఇద్దరు అగ్ని మాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. ఈ భవనంలో మంటలను ఆర్పే క్రమంలో నిన్న ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదం జరిగిన భవనంలో చిక్కుకున్న నలుగురు కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. ఈ భవనంలోని ఫస్ట్ ఫ్లోర్ లో ముగ్గురు కార్మికులు చిక్కుకుపోయినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
also read:డెక్కన్ స్టోర్ లో ముగ్గురు కార్మికులున్నట్టు అనుమానం: సెంట్రల్ జోన్ డీసీపీ
ముగ్గురి ఫోన్ల సిగ్నల్స్ ఈ భవనంలోపలే ఉన్నట్టుగా చూపిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు.ఈ భవనం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న నేపథ్యంలో భవనంలోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఈ భవనం వెనుక వైపున స్లాబ్ లు కుప్పలు కుప్పలుగా పడిపోయి కన్పించినట్టుగా అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. మూడు, నాలుగో అంతస్థుల్లోని స్లాబ్ లు కూడా కుప్పకూలినట్టుగా అధికారులు గుర్తించారు. మెట్ల మార్గం కూడా కూలిపోయింది. ఈ భవనాన్ని కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ భవనం కూల్చివేస్తే ఇతర భవనాల పరిస్థితి ఏమిటీ,ఈ భవనాన్ని ఎలా కూల్చివేయాలనే దానిపై నిపుణుల సూచనల ఆధారంగా చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
సికింద్రాబాద్ పరిధిలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వ్యాపార సముదాయాల్లో అగ్ని ప్రమాదాలతో పలువరు మృత్యువాత పడుతున్నారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్రమంగా నిర్మించిన భవనాలను రెగ్యులరైజ్ చేయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదాయం కోసం కాకుండా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. రానున్న రోజుల్లో ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకోకుండా స్పెషల్ డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.