దళితులను గుచ్చుతున్న ‘గులాబీ’ ముళ్లు

First Published Jan 24, 2017, 12:26 PM IST
Highlights

టీఆర్ఎస్ సర్కారు తమపై చూపుతున్న వివక్షతపై ఇప్పుడిప్పుడే దళిత సంఘాలు గళం విప్పుతున్నాయి.

 

రెండున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో తమకేమీ ఒరగలేదని దళిత సంఘాలు నిర్వేదం చెందుతున్నాయి. బంగారు తెలంగాణ అంటున్న సర్కారు తమ బతుకు కోసం కాస్త సాయం కూడా చేయడం లేదని ఆరోపిస్తన్నాయి.

 

సామాజిక తెలంగాణ లక్ష్యంగా ముందుండి పోరాడిన దళిత సంఘాలు అప్పటి పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వంలో తమలో ఉన్న విబేధాలు మరిచి ముందుకుసాగి ఉద్యమించాయి.

 

దీనికి తగ్గట్టు కేసీఆర్ కూడా తమ పార్టీ మేనిఫెస్టోలో దళితులను ఆకర్షించే అనేక పథకాలను ప్రకటించారు. దళితుడైన కడియం శ్రీహరికే మేనిఫెస్టో బాధ్యతలు అప్పగించారు.

 

ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం గట్టారు. కానీ, కేసీఆర్ మాత్రం పీఠం ఎక్కకముందే తన మొదటి హామీని తుంగలో తొక్కారు.

 

ఉద్యమ సమయంలో దళితుడినే సీఎం చేస్తానన్న కేసీఆర్ .. గెలిచాక ఆ మాటమార్చేశారు. ఇక ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ పరిస్థితి కూడా అలానే ఉంది. గత బడ్జెట్ లో రూ.10 వేల కోట్లు కేటాయిస్తే రూ.4,250 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన నిధులను గత ప్రభుత్వాల లాగే వేరే పథకాలకు మళ్లించారు.

 

అలాగే, దళిత మహిళ పేరు మీద మూడు ఎకరాల ఉచిత సేద్యపు భూమి పథకం కూడా మాటలకే పరిమిత మైంది. 10 జిల్లాలకు కలిపి  1000 ఎకరాలు కూడా పంపిణి చేయలేదు.

 

రాష్ట్రంలో పదిశాతం ఉన్న తమను రెండున్నరేళ్ల నుంచి నమ్మించి మోసం చేస్తున్నారని సీఎం పై దళిత సంఘాలు కాస్త గుర్రుగానే ఉన్నాయి.

 

సమైక్య ఆంధ్రలో కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాతే దళితులు ఎక్కువగా నష్టపోయామని మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ఱ మాదిగ వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం.

 

click me!