ఓవైసీ ‘దంగల్’ ప్రచారం

First Published Jan 24, 2017, 9:13 AM IST
Highlights

పాతబస్తీలో కలకలం సృష్టించిన ఓవైసీ దంగల్ పోస్టర్లు

 

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అన్ని పార్టీలు దూసుకెళ్తున్నాయి. ఇక మైనారిటీ నేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అక్కడ కూడా ఓట్లు కొల్లగొట్టేందుకు కొత్త వ్యూహాలు పన్నుతున్నారు.

 

అవకాశం వచ్చిన ప్రతిసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

 

ఇటీవల హజ్ యాత్రకు సబ్సిడీ తీసివేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సబ్సిడీని మైనారిటీ బాలికల విద్య కోసం ఖర్చు చేయాలని సూచించారు.

 

అలాగే, తమిళనాడు జల్లికట్టు వివాదాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. జల్లికట్టు పై ఆర్డినెన్సుకు కేంద్రం ఆమోదం తెలపడంపై స్పందిస్తూ భారత్ లో భిన్నత్వానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

 

అంతేకాదు ఉమ్మడి పౌరస్మృతిని తీసుకరావాలనుకుంటున్న ప్రభుత్వాలు జల్లికట్టు వివాదం నుంచి గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు.

 

భిన్నసమాజాలు ఉన్న దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకరావడం సరికాదన్నారు. జల్లికట్టు కు మినహాయింపు ఇస్తూ ఆర్డినెన్సు తెచ్చినట్లే రేపు కోర్టులు... యూనిఫాం సివిల్ కోడ్ ను కచ్చితంగా అమలు చేయాలంటే దానిపై కూడా ఆర్డినెన్స్ తీసుకరావాలని పరోక్షంగా సూచించారన్నమాట.

 

ఇలా దేశంలో జరుగుతున్న ప్రతి సంఘటనను తమ పొలిటికల్ మైలేజీకి వినయోగించుకోవడంలో ఓవైసీ అందరికంటే రెండాకులు ఎక్కువే చదివారు.

 

ఇప్పుడు ఆయన కార్యకర్తలు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు. దీనికి పాతబస్తీలో జరిగిన ఓ సంఘటన ఉదహరణ గా చెప్పుకోవచ్చు.

 

ఇటీవల బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన దంగల్ సినిమా పోస్టరును ఎంఐఎం కార్యకర్తలు బాగా వాడుకుంటున్నారు.

 

అమీర్ ఖాన్ గెటప్ లో ఓవైసీని మిగిలిన కేరెక్టర్ ల ప్లేస్ లో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, అమిత్ షా లతో కూడిన ఓ పోస్టర్ ను వారు పాతబస్తీలో ఏర్పాటు చేశారు.

 

పాతబస్తీలోని మదీనా, అఫ్జల్‌గంజ్‌లో ఈ పోస్టర్లు ఇప్పుడు హల్ చెల్ చేస్తున్నాయి. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం బరిలోకి దిగుతుండటంతో ఈ పోస్టర్లు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారన్నమాట.

 

అయితే ఈ పోస్టర్ల పట్ల బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వాటిని తొలగించారు. అయితే ఎంఐఎం మాత్రం ఈ పోస్టర్‌తో తమకు సంబంధం లేదని ప్రకటించింది.

 

 

click me!