
సాంకేతిక సాయంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే కొత్త వ్యూహానికి తెలంగాణ రాజకీయ జేఏసీ పదును పెడుతోంది. ఇకపై సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత అందుబాటులోకి రావాలని వాటి ద్వారానే ఉద్యమాలను చాలా తక్కువ సమయంలో జానాల్లోకి తీసుకెళ్లొచ్చని నిర్ణయించింది.
ఇలా టీజేఏసీ ఆన్ లైన్ బాట పట్టడానికి ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
మల్లన్న సాగర్ ముంపు బాధితులు, ఫీజు రియింబర్స్ మెంట్, జిల్లాల పునర్విభజన తదితర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చాలా సైద్దాంతికంగా టీ జేఏసీ పోరాడుతూనే ఉంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో తిరిగినట్లే ప్రతి ప్రాంతంలో పర్యటిస్తూనే ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా టీ జేఏసీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు. అయినా టీ జేఏసీ అనుకున్న విధంగా ప్రజలను నుంచి స్పందన రావడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా జేఏసీ చైర్మన్ కోదండరాం కూడా అంగీకరించారు.
ప్రభుత్వ వ్యతికేక విధానాలపై పోరాడుతూ తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో కలిపి దాదాపు 3000 వేల కిలోమీటర్లు ప్రర్యటించినా తాము అనుకున్న విధంగా ప్రజా స్పందన కానరాలేదని పేర్కొన్నారు. నిజంగా దీన్ని తమ ప్రచార వైఫల్యంగా ఆయన అంగీకరించారు.
ఈ సమయంలో తమిళనాడులో జల్లికట్టు ఉద్యమానికి యువత నుంచి వచ్చిన అనూహ్య స్పందన కోదండరాంను బాగా ఆకర్షించింది.
జల్లికట్టు పై నిషేధం విధించడంతో అక్కడ యువత అంతా ఏకమైన విషయం తెలిసింది. గంటల వ్యవధిలోనే మెరీనా బీచ్ జన సంద్రమైంది. జల్లికట్టు నిషేధంపై హోరెత్తింది. ఇదంతా సోషల్ మీడియాలో యువత ఇచ్చిన పిలుపు వల్లే సాధ్యమైందన్నది అందరికీ తెలిసిన విషయమే.
సోషల్ మీడియా ద్వారా జల్లికట్టు ఉద్యమం ఎంత సక్సెస్ అయిందో గుర్తించిన కోదండరాం ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ లో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణించారు.
అందుకే జేఏసీ నాయకులకు సోషల్ మీడియా పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు.
త్వరలో అధికారికంగా ట్విటర్, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత చేరువై ఆన్ లైన్ లో ఉద్యమస్ఫూర్తిని ప్రజల్లో రగిలించాలని డిసైడ్ అయ్యారు.
ఇందులో భాగంగా సోషల్ మీడియా లో ఎక్కువ యాక్టివ్ గా ఉండే యువతే లక్ష్యంగా నిరుద్యోగ ఉద్యమాన్ని ఆన్ లైన్ వేదికగా ప్రారింభించేందుకు సిద్ధమవుతున్నారు.
ఫిబ్రవరి మూడో వారంలో నిర్వహించే నిరుద్యోగ ర్యాలీ ప్రచారాన్ని సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.