Hyderabad rains: చెన్నై నగరంలో జలవిలయం సృష్టిస్తున్న మిచౌంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, ఒడిశాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతోంది.
Cyclone Michaung: మిచౌంగ్ తుఫాను ప్రభావంతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రమంతటా మేఘావృతమైన వాతావరణం కనిపిస్తోంది. రాజధాని నగరం హైదరాబాద్ లో కూడా వానలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తున్న హైదరాబాద్‌లో మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనాల మధ్య ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మిచౌంగ్ తుఫాను కారణంగా ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో రోజువారీ జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయనీ, తెల్లవారుజామున పొగమంచు వాతావరణం నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నిన్న (సోమవారం) కూడా పలు చోట్ల వర్షం కురిసింది. సైదాబాద్‌లో అత్యధికంగా 3.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. బండ్లగూడ, చార్మినార్, బహదూర్‌పురా, ఆసిఫ్‌నగర్, నాంపల్లి, మారేడ్‌పల్లి, షేక్‌పేట సహా ఇతర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది.
హైదరాబాద్ నగరంలో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లాలోని పాడర మండలంలో అత్యధికంగా 36.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నేడు, మైచాంగ్ తుఫాను నెల్లూరు, మచిలీపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అయితే, ఇప్పటికే మిచౌంగ్ తుఫాను బాపట్ల తీరం చేరుకుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
తమిళనాడులో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. చెన్నైలో, బలమైన గాలులకు అనేక చెట్లు నేలకూలాయి. ఎడతెరిపి లేకుండా దంచికొట్టిన వానతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వరద నీటిలో కార్లు సైతం కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నివాస ప్రాంతాలు జలమయం కావడంతో రోజువారీ జీవితానికి అంతరాయం కలిగించింది. ఇక సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలు కూడా మిచౌంగ్ తుఫాను ప్రభావాన్ని అనుభవిస్తున్నాయి.