Kalvakuntla chandrashekar rao : తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును ఆమోదిద్దామని బీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరుఫున ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమై మాట్లాడారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి స్థిరపడేందుకు కాంగ్రెస్ కు తగిన సమయం ఇవ్వాలని సూచించారు.
telangana assembly election results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ కేవలం 39 స్థానాలకే పరిమితమయ్యింది. కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ దక్కడంతో ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. అయితే బీఆర్ఎస్ ఓటమిని అంగీకరించాలని ఆ పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రజాతీర్పును హుందాగా స్వీకరించి అధికారం నుంచి వైదొలగాలని కోరారు. రాజ్యాంగం ప్రకారం జనవరి 16 వరకు అధికారంలో కొనసాగే హక్కు బీఆర్ఎస్ కు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీ నాయకులు అవసరమైన మద్దతు ఇవ్వాలని ఆయన సూచించారు.
ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో కొత్తగా ఎన్నికైన బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు త్వరలో తెలంగాణ భవన్ లో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలోనే బీఆర్ ఎస్ లెజిస్లేచర్ పార్టీ నేతను ఎన్నుకుందామని అన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి స్థిరపడేందుకు కాంగ్రెస్ కు తగిన సమయం ఇవ్వాలని సూచించారు.
కొత్తగా బీఆర్ఎస్ తరుఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నాయకులను కేసీఆర్ అభినందించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నేతలందరూ చేసిన కృషిని కొనియాడారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేలు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీని బలోపేతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి లోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ గారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వారికి కేసీఆర్… pic.twitter.com/ckYoTNTJBC
కాగా.. అంతకుముందు తెలంగాణ భవన్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు పార్టీ జిల్లా కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేకు సూచించారు. పార్టీ ఓటమికి దారితీసిన అంశాలపై ఆత్మపరిశీలన చేసుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కూడిన టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశాన్ని త్వరలో నిర్వహిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన తేదీలను త్వరలోనే ఖరారు చేసి ప్రకటిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజలు మరో పార్టీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారని, అయినా వారి తరఫున పోరాడేందుకు అసెంబ్లీలో గౌరవప్రదమైన బలాన్ని ఇచ్చారని తెలిపారు. కాబట్టి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా అందరం విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల తర్వాత బీఆర్ ఎస్ నాయకత్వానికి మద్దతుగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని రామారావు పేర్కొన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని ఊహించలేదని అన్ని వర్గాల ప్రజలు సందేశాలు పంపుతున్నారని ఆయన తెలిపారు.