Cyclone Gulab: మరో రెండు రోజులు భారీ వర్షాలు... అప్రమత్తంగా వుండండి: మంత్రి గంగుల ఆదేశాలు

Arun Kumar P   | Asianet News
Published : Sep 28, 2021, 11:49 AM IST
Cyclone Gulab: మరో రెండు రోజులు భారీ వర్షాలు... అప్రమత్తంగా వుండండి: మంత్రి గంగుల ఆదేశాలు

సారాంశం

తెలంగాణలో మరో రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా వుండాలని మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు.

కరీంనగర్: ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించిందని... ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని కరీంనగర్ జిల్లా ప్రజలకు మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు ఎక్కువగా ఇళ్లలోనే వుండటానికి ప్రయత్నించాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా అధికారులతో మంత్రి గంగుల హైదరాబాద్ నుండి ఫోన్లో మాట్లాడారు.

వర్షాలు తీవ్రంగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందిపడకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని... వరద ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడం, ప్రాజెక్టులు, కాలువల్లో నీరు నిండుగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులను మంత్రి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండాలని... వరదలపై అప్రమత్తంగా ఉండాలని... ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అక్కడ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అవసరమైన చోట స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని బాధితులకు సాయం చేయాలని అధికారులకు సూచించారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాస కేంద్రాల్లో వారికి కావల్సిన వసతులు కల్పించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితులు పర్యవేక్షించాలని... శిథిలావస్థ భవనాలు, కూలిపోయే దశలో ఉన్న నిర్మాణాలలో ప్రజలు ఎవరూ లేకుండా ఖాళీ చేయించాలని సూచించారు.

read more  Cyclone Gulab:కేటీఆర్ ఇలాకాలో ఇదీ పరిస్థితి... వరదనీటితో వాగుల్లా మారిన రోడ్లు 

 ప్రజలకు ఎప్పుడు ఏ సాయం కావల్సిన వెంటనే అందించేందుకు వీలుగా కలెక్టర్ కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని... ఇందుకోసం తగిన సిబ్బందిని నియమించాలని చెప్పారు. కంట్రోల్ సెంటర్ గురించి రెవెన్యూ, రిస్క్యూ సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు.  అత్యవసర సిబ్బందిని సిద్ధం చేసుకుని అనుకోకుండా ప్రమాదం సంభవిస్తే వెంటనే ఆదుకునే విధంగా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో అవసరమైతే డిఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలన్నారు మంత్రి గంగుల.

మరో రెండు రోజుల పాటు కూడా వర్షపాతం ఉన్నందున వరద నివారణ, ప్రమాద నివారణకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు, అత్యవసర సేవలు అందించేందుకు అధికార యంత్రంగం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ప్రజలు కూడా తమ తమ నివాసాల నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని మంత్రి గంగుల కోరారు.
 
 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?