హోల్ సేల్ ధరకే మాస్క్ లని చెప్పి.. రూ.30లక్షలు స్వాహా

By telugu news teamFirst Published Jun 27, 2020, 8:30 AM IST
Highlights

హంగేరి కంపెనీ ప్రతినిధిగా పరిచయమైన వ్యక్తి వాట్సాప్ ద్వారా అగ్రిమెంట్ ఫంపించాడు. వెంటనే దాన్ని జూబ్లిహిల్స్ లోని సంస్థ యాజమాన్యం సంతకాలు చేసి తిరిగి వాట్సాప్ లో పంపించింది. సరుకు పంపాలంటే కనీసం 50శాతం పేమెంట్ చేయాలని హంగేరీ దేశానికి చెందిన కంపెనీ వ్యక్తి చెప్పడంతో.. వీరు కూడా అంగీకరించారు.
 

సైబర్ నేరగాళ్లు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. ప్రజల అవసరాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాజాగా మాస్క్, గ్లౌజ్ ల పేర్లు చెప్పి రూ.30లక్షలు కాజేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియా మార్ట్ అనే సైట్ లో హోల్ సేల్ ధరలకే మాస్క్ లు, గ్లౌజ్ లు అందజేస్తామంటూ హంగేరి దేశానికి చెందిన ఓ కంపెనీ పేరిట ఇటీవల ఓ ప్రకటన జారీ అయ్యింది. ధరలతోపాటు ఒక కొటేషన్ కూడా ఉంచింది. గ్లౌజ్, మాస్క్ లను హోల్ సేల్ గా విక్రయించే జూబ్లీహిల్స్ లోని ఓ సంస్థ హంగేరీ కంపెనీని సంప్రదించింది.

ఇద్దరూ కొటేషన్లు ఇచ్చిపుచ్చుకున్నారు. హంగేరి కంపెనీ ప్రతినిధిగా పరిచయమైన వ్యక్తి వాట్సాప్ ద్వారా అగ్రిమెంట్ ఫంపించాడు. వెంటనే దాన్ని జూబ్లిహిల్స్ లోని సంస్థ యాజమాన్యం సంతకాలు చేసి తిరిగి వాట్సాప్ లో పంపించింది. సరుకు పంపాలంటే కనీసం 50శాతం పేమెంట్ చేయాలని హంగేరీ దేశానికి చెందిన కంపెనీ వ్యక్తి చెప్పడంతో.. వీరు కూడా అంగీకరించారు.

ఓ బ్యాంక్ ఖాతాకు రూ.30లక్షలు ట్రాన్స్ ఫర్ చేశారు. ఇచ్చిన గడువులోపు సరుకు రాకపోవడంతో సదరు కంపెనీ ప్రతినిధిని సంప్రదించాలని ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో మోసపోయామని తెలుసుకున్నారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!