రేషన్ డీలర్లకు సర్కారు హెచ్చరిక

First Published Jun 30, 2017, 6:52 PM IST
Highlights

తెలంగాణ రేషన్ డీలర్ల ఆందోళనపై సర్కారు కన్నెర్రజేసింది. తొందరపడి సమ్మె చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇండికేషన్ ఇచ్చింది. కమిషన్ పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సమ్మె ఆలోచన విరమించుకోవాలని సూచించింది.

రేషన్ డీలర్ల సమ్మెపై తెలంగాణ సర్కారు కన్నెర్రజేసింది. తొందరపడి సమ్మెకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సివిల్ సప్లై కమిషనర్ సి.వి.ఆనంద్ డీలర్లను హెచ్చరించారు. సమ్మె విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని అన్నారు. తొందరపడి సమ్మె చేస్తే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాల్సి వస్తుందని హెచ్చరించారు.

 

ఆగస్టు మాసంలో సమ్మెకు దిగుతామని రేషన్ డీలర్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో గత రెండు రోజులుగా సివి ఆనంద్ రేషన్ డీలర్ల సంఘం నేతలతో సమావేశమయ్యారు. కమిషన్ పెంపు విషయంలో తొందరలోనే నిర్ణయం తీసుకుంటామని సివి ఆనంద్ చెప్పారు.

 

రానున్న రోజుల్లో రేషన్ షాపుల్లో ఈపాస్ యంత్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రేషన్ షాపులు మినీ బ్యాంకులుగా మారనున్నాయని చెప్పారు. త్వరలోనే రేషన్ షాపు ఓనర్ల ఆదాయం పెరగడం ఖాయమన్నారు.

 

మరోవైపు రేషన్ డీలర్ల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి రేషన్ డీలర్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో డీలర్లను నిన్న అర్థరాత్రి నుంచే ముందస్తు అరెస్టులు చేశారు. హైదరాబాద్ పొలిమేరకు ఎవరూ  డీలర్లు రాకుండా పోలీసుల అరెస్టుల పర్వం కొనసాగింది. రేషన్ డీలర్ల ఆందోళనకు ప్రతిపక్ష కాంగ్రెస్, తెలంగాణ జెఎసి మద్దతు ప్రకటించాయి.

click me!