
ఇటీవల కాలంలో పాలమూరు పోలీసులు సరికొత్త ప్రయోగాలు చేస్తూ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీగా రెమారాజేశ్వరి నియామకం తర్వాత ప్రాక్టికల్ గా జనాలకు దగ్గరయ్యేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు పాలమూరు పోలీసులు. అందులో భాగంగానే మహిళలు సమానత్వం, మహిళలపై దురాగతాలు జరగకుండా చూడడమెలా? అన్యాయం జరిగినపుడు పోలీసులకు ఫిర్యాదు చేయడమెలా,బాల్య వివాహాలను నివారించడం లాంటివి అనేక కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టారు.
ఈ రోజు తెలంగాణ సర్కారు వైఖరిని నిరసిస్తూ రేషన్ డీలర్లు పోరుబాట పట్టారు. ప్రగతి భవన్ ముట్టడిస్తామని ప్రకటించారు. దీంతో అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ రేషన్ డీలర్లను అర్థరాత్రి నుంచే ముందస్తు అరెస్టులు చేశారు. ఇదే సమయంలో పాలూమరు జిల్లాలోని రేషన్ డీలర్లను ముందస్తు అరెస్టు చేసి జడ్చర్ల పోలీసు స్టేషన్ కు తరలించారు. అరెస్టయి జడ్చర్ల స్టేషన్ లో ఉన్న రేషన్ డీలర్లకు కొత్త అనుభవం ఎదురయింది. సమాజంలో స్త్రీ హోదా మెరుగుపరిచేందుకు, గౌరవం తెచ్చిపెట్టేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిన సిఐ గంగాధర్, ఎస్సై మధుసూదన్, కానిస్టేబుల్ జకీర్ రజా లు సమానత్వం సమన్యాయం అనే అంశంపై వీరందరికి శిక్షణ ఇచ్చారు. ముందస్తు అరెస్టు చేసిన వారిని అలా వదిలేయకుండా ఆ సమయంలో వారికి మహిళల పట్ల ఎలా మసలుకోవాలనే విషయంలో మంచి శిక్షణ ఇవ్వడం కొత్తగా అనిపించిన రేషన్ డీలర్లు చప్పట్లు కొట్టి పోలీసులను అభినందించారు. ఈ విషయంలో జిల్లా ఎస్సీ చొరవను అభినందించారు. తాము ఈ విషయంలో పోలీసులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
గతంలో జిల్లాలో 30 మంది పోలీసులను ఎంపిక చేసుకుని వారికి స్త్రీ, పురుష సమానత్వం అనే అంశంపై ఢిల్లీకి చెందిన పీపుల్స్ ఫర్ ప్యారిటీ అనే స్వచ్ఛంద సంస్థ వారితో ఎస్ పి రెమా రాజేశ్వరి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. పోలీసులు మహిళల పట్ల ఎలా మసలుకోవాలి? అత్యాచారానికి గురైన వారి పట్ల ఎలా ఉండాలి? పురుషులు, మహిళలు ఎందుకు సమానం అనే అంశాల్లో క్షుణ్ణంగా ఆ 30 మంది పోలీసు అధికారులకు శిక్షణ ఇప్పించారు. ఇక వారంతా వారి వారి సొంత పోలీసు స్టేసన్లలో పనిచేస్తున్న మిగతా పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. అయితే ఇందులో కొన్ని సమస్యలు వచ్చాయి. ఒక పోలీసు స్టేషన్ నుంచి శిక్షణకు ఎంపికైన కానిస్టేబుల్ తర్వాత ఆ పోలీసు స్టేషన్ లో శిక్షణ ఇస్తే ఎస్సై, మిగతా ఎఎస్సై, హెడ్ కానిస్టేబుల్ వంటి వాళ్లు వినే అవకాశం ఉండదని గుర్తించిన ఎస్సీ ఇక జిల్లా మొత్తానికి ఒక్కో పోలీసు స్టేషన్ సిబ్బంది ఒక్కోరోజు శిక్షణకు వచ్చేలా ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన 30 మంది పోలీసుల్లో ఏరకమైన మార్పులు వచ్చాయో కూడా ఎస్సీ పరిశీలించారు. శిక్షణ పొందిన వారి భార్యలతో ఇంటరాక్ట్ అయ్యారు. శిక్షణకు ముందు వారు ఇంట్లో ఎలా ఉండేవారు, శిక్షణ తర్వాత ఎలా ఉంటున్నారో తెలుసుకున్నారు. వారిలో చాలా మార్పు వచ్చిందని సదరు పోలీసు భార్యలు ఎస్సీకి వివరించారు.
ఇదే కాకుండా బాల్య వివాహాల నివారణ కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టి విజయవంతమయ్యారు పాలమూరు పోలీసులు. జిల్లాలో నిరక్షరాస్యత ఎక్కువ ఉన్న కారణంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. వాటిని నివారించేందుకు పెళ్లిళ్లు చేసే పంతుళ్లు, చర్చి పాస్టర్లు, మసీదుల్లో పెళ్లి పెద్దలందరినీ పిలిచి వారితో సమావేశం జరిపారు. మేజర్లు కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో వారి పెళ్లిళ్లు చేయవద్దని, ఏదో ఒక కారణం చూపి వాయిదా వేయాలని వారికి చెప్పి వారిని ఒప్పించారు. దీంతో అక్కడ బాల్య వివాహాలు బాగా తగ్గిపోయాయి.
మొత్తానికి పాలమూరు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను అభినందించాల్సిందేనని పలువురు జిల్లా వాసులు అంటున్నారు.