కాంగ్రెస్ పార్టీతో చర్చల సారాంశాన్ని సీపీఐ నేతలకు వివరించారు ఆ పార్టీ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రేతో సమావేశమయ్యారు.
హైదరాబాద్: సీపీఐ మాజీ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి నివాసంలో సీపీఐ నేతలు ఆదివారం నాడు సాయంత్రం సమావేశమయ్యారు.ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రేతో సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు విషయమై రెండ పార్టీల మధ్య చర్చ జరిగింది. ఈ చర్చల సారాంశాన్ని కూనంనేని సాంబశివరావు చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డికి వివరించారు.
సీపీఐ నాలుగు అసెంబ్లీ స్థానాలను అడుగుతుంది. అయితే రెండు అసెంబ్లీ స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందని సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓ ఎమ్మెల్సీ పదవిని కూడ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందని సమాచారం. కాంగ్రెస్ పార్టీతో చర్చల సారాంశంతో పాటు భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై సీపీఐ నేతలు చర్చిస్తున్నారు.
ఈ నెల 21 బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు . దీంతో లెఫ్ట్ పార్టీలతో పొత్తు లేదని తేల్చి చెప్పినట్టైంది. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో షాక్ కు గురైన లెఫ్ట్ పార్టీలు రానున్న ఎన్నికల్లో ఏం చేయాలనే దానిపై తర్జన భర్జనలు పడుతున్నాయి. సీపీఐ రాష్ట్ర సమితి కార్యవర్గం రెండు రోజుల క్రితం సమావేశమైంది. ఇవాళ సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశమైంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. పొత్తులపై తొందరపడాల్సిన అవసరం లేదని ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తర్వాత సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.
also read:మా ప్రతిపాదనలకు అంగీకరిస్తేనే మరిన్ని చర్చలు: కాంగ్రెస్‌తో పొత్తుపై కూనంనేని
బీఆర్ఎస్ తో లెఫ్ట్ పార్టీల సంబంధాలు చెడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలతో పొత్తు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు లెఫ్ట్ నేతలతో చర్చలను ప్రారంభించారు. ఇవాళ సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వద్ద సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు.ఈ ప్రతిపాదనలపై కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చే స్పందన ఆధారంగా సీపీఐ నేతలు కాంగ్రెస్ పార్టీతో చర్చలకు వెళ్లనున్నారు.