
సీపీఐ రాష్ట్ర కారదర్శి కూనంనేని సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకటి, రెండు సీట్ల కోసం సీపీఐ పార్టీ తలవంచదని చెప్పారు. బీజేపీని నిలువరించే క్రమంలో వేరే ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటామని తెలిపారు. అందరం కలిసి వచ్చే ఎన్నికల్లో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన పోరాటాలు వదలమని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు కోసం సీపీఐ పోరాటాలు చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై జాతీయ స్థాయిలో ఆలోచిస్తామని తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల కూడా పొత్తులపై కూనంనేని కీలక వ్యాఖ్యలు చేశారు. సీట్ల పంపకాలపై ఇప్పటివరకు బీఆర్ఎస్‌తో చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేస్తాయని అన్నారు. త్వరలో వామపక్షాల ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సీపీఐ, సీపీఎం పార్టీలు తలుచుకుంటే రాష్ట్రంలో అధికారం తారుమారు అవుతాయని చెప్పుకొచ్చారు. వామపక్షాలు అనేక నియోజకవర్గాల్లో బలంగా ఉన్నాయని.. అవి ఇతర పోటీదారుల అవకాశాలను ఒక విధంగా లేదా మరొక విధంగా ప్రభావితం చేయగలవని ఆయన అన్నారు. పొత్తు కోసం మేం ఇతర పార్టీల చుట్టూ తిరగబోమని.. అయితే వారు తమ దగ్గరికి వస్తే స్పందిస్తామని చెప్పారు. దేశానికి ప్రమాదంగా మారిన బీజేపీని నిలువరించేందుకే మునుగోడులో బీఆర్ఎస్ కు మద్దతు తెలిపామని మరోసారి చెప్పారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్‌తో వామపక్షాలు పొత్తుపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో కేసీఆర్ మాట్లాడుతూ.. వామపక్ష పార్టీలతో తమ స్నేహం మునుగోడుకే పరిమితం కాదని, భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ప్రకటించారు. అయితే వామపక్షాల నుంచి మాత్రం రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కలిసి సాగుతామనే స్పష్టమైన ప్రకటన వెలువడటం లేదు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు.. జాతీయ స్థాయిలో వామపక్షాలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇటీవల కామెంట్ చేశారు.