
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దాఖలు చేసిన పరువు నష్టం దావాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సమన్లు జారీ అయ్యాయి. స్వయంగా లేదా న్యాయవాది ద్వారా ఈ నెల 24న కోర్టుకు హాజరు కావాలని హైదరాబాద్ సిటీ సివిల్‌కోర్టు 3వ అదనపు చీఫ్ జడ్జి ఆయనను ఆదేశించారు.
సినీ పరిశ్రమలో తనకు అన్యాయం జరిగిందంటూ ఫిలిం చాంబర్ ఎదుట సినీ నటి శ్రీరెడ్డి నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై పవన్ చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి మండిపడ్డారు. ఆయనను తీవ్రంగా దూషించారు. ఆ దూషణలో పవన్ తల్లిని కించపరిచే పదం వాడారనే ఆరోపణలు వచ్చాయి.
దీనిపై అసహనం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై ఈ ఏడాది ఏప్రిల్ 20 నుంచి 23 వరకు ట్విటర్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. తన తల్లిని బహిరంగంగా దూషించిన విషయంలో రాధాకృష్ణ కూడా మైలేజీ పొందారని ఆరోపించారు. ఆ ట్వీట్‌తోపాటు రాధాకృష్ణ ఫొటోను కూడా ట్విటర్లో ఉంచారు.
దాంతో, ఆ ట్వీట్లు నిరాధారమని, తన, ‘ఆంధ్రజ్యోతి’ మీడియా సంస్థల పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా అవి ఉన్నాయని ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ అంటూ వాటిని ఉపసంహరించుకోవాలని, ఆయన ఏ సామాజిక మాధ్యమం ద్వారా ఆరోపణలు చేశారో దాని ద్వారానే క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ ను డిమాండ్ చేశారు.
దానిపై తన న్యాయవాది ద్వారా లీగల్ పవన్ కల్యాణ్ కు నోటీసులు పంపించారు. పవన్ నుంచి స్పందన రాలేదు. దాంతో రాధాకృష్ణ రూ.10 కోట్లకు పవన్‌పై పరువు నష్టం దావా వేశారు.