
హైదరాబాద్: ఒక్కోసారి చాలా చిన్న చిన్న మాటలు కూడా మనస్సును చివుక్కుమనిపిస్తాయి. మనం ఊహించని విషయాలకు కూడా కొందరు తీవ్రంగా గాయపడతారు. హైదరాబాద్‌లో రూ. 1800 కోసం భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. ఆ ఘర్షణతో భర్త మనస్తాపానికి గురయ్యాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లి ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎస్సై శేఖర్ అందించిన వివరాల ప్రకారం, కార్వాన్ సత్యనారాయణ కాలనీలో జగ్గేటి కిషన్, శ్యామల దంపతులు జీవిస్తున్నారు. వారికి ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురుకు పెళ్లి చేశారు. ఈ నెల 15వ తేదీన రూ. 1,800 క్యాష్ గురించి దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ డబ్బు విషయంలో భార్య శ్యామల గొడవ పెట్టుకోవడంతో కిషన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అదే రోజు సాయంత్రం కిషన్ మనసులో బాధతో ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. మళ్లీ తిరిగి రాలేదు.
ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాక చీకటి పడుతున్నా కిషన్ ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాత్రి 7 గంటల ప్రాంతంలో అతనికి ఫోన్ చేశారు. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి త్వరగానే వచ్చేస్తానని సమాధానం చెప్పాడు. కానీ, అతను తిరిగి రాలేదు. ఆ తర్వాత ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తే కిషన్ ఫోన్ స్విచ్చాఫ్ అని వచ్చింది.
Also Read: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు మరోసారి కుట్ర.. మహిళ అరెస్ట్..
గురువారం సాయంత్రం కార్వాన్ రాంసింగ్ పురా చౌరస్తా దగ్గర మూసీనది ఒడ్డున ఓ చెట్టుకు ఉరితాడుకు వేలాడుతూ కిషన్ డెడ్ బాడీ కనిపించింది. కిషన్ ఉరి వేసుకున్నాడని స్థానికులు గమనించి పోలీసులకు, అలాగే కుటుంబ సభ్యులక సమాచారం అందించారు. పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ పంపించారు. శుక్రవారం పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు.