తెలంగాణలో కొత్తగా 11 మందికి పాజిటివ్, 1000కి చేరిన కేసులు: హైదరాబాద్‌లోనే అత్యధికం

By Siva KodatiFirst Published Apr 26, 2020, 9:57 PM IST
Highlights

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం కొత్తగా 11 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి వారి సంఖ్య 1,001కి చేరింది

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం కొత్తగా 11 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి వారి సంఖ్య 1,001కి చేరింది.

ఇవాళ నమోదైన కేసులన్నీ హైదరాబాద్‌ పరిధిలోనివే కావడం ఆందోళన కలిగించే అంశం. కాగా తెలంగాణ ఇప్పటి వరకు కరోనా కారణంగా 25 మంది మరణించారు. మరోవైపు కోవిడ్ 19 నుంచి కోలుకున్న 9 మందిని ఆదివారం డిశ్చార్జ్ చేశారు.

Also Read:పోలీసులకు కరోనా: రెండు పోలీస్ స్టేషన్లకు లాక్.. 105 మంది సిబ్బంది క్వారంటైన్‌లోకి

వీరితో కలిపి ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 316కి చేరింది. ఇవాళ కోలుకున్న వారిలో 75 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరోవైపు దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,975 మందికి కరోనా సోకగా.. 47 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. వీటితో కలిపి భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 26,917కి చేరుకుంది.

అలాగే తాజాగా మృతి చెందిన వారితో కలిపి దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 826కి చేరుకుంది. ఇప్పటివరకు 5,194 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. మరో 20,177 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి చర్చించనున్నారు. రేపు ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంల అభిప్రాయాలు తీసుకోనున్నారు.

Also Read:రేపు సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్.. లాక్‌డౌన్ ఎత్తేస్తారా, పొడిగిస్తారా: దేశ ప్రజల ఆసక్తి

కరోనా నియంత్రణతో పాటు లాక్‌డౌన్‌ అమలుపైనా చర్చింనున్నారు. దేశంలో కోవిడ్ 19 వెలుగులోకి వచ్చిన తర్వాత తొలుత మార్చి 20న ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని 24న లాక్‌డౌన్ ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్ 11న రెండోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన వారి అభ్యర్ధన మేరకు లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు.

ఈ క్రమంలో రెండో దశ లాక్‌డౌన్ ముగింపునకు గడువు సమీపిస్తుండటంతో దానిపై చర్చించే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేసే అంశంపై ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది

click me!