కరోనా థర్డ్ వేవ్ విజృంభణ... కట్టడికోసం ఇలా చేయండి..: కేంద్ర మంత్రికి హరీష్ సూచనలు

By Arun Kumar PFirst Published Jan 18, 2022, 12:26 PM IST
Highlights

కరోనా కట్టడికి పలు సలహాలు, సూచనలిస్తూ కేంద్ర వైద్యారోగ్య మంత్రి మాండవీయకు రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు లేఖ రాసారు. 

హైదరాబాద్: కరోనా థర్డ్ వేవ్ (corona third wave) విజృంభణ నేపథ్యంలో వ్యాక్సినేషన్ (corona vaccination) ను మరింత వేగవంతం చేయాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (harish rao) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పలు సలహాలు, సూచనలిస్తూ కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ (mansukh mandaviya)కు హరీష్ లేఖ రాసారు.  

ఇప్పటికే కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరముందని కేంద్ర మంత్రికి హరీష్ సూచించారు. దేశవ్యాప్తంగా అత్యధిక శాతం ప్రజలు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 9 నెలల నుండి 6 నెలలకు తగ్గించాలని హరీష్ డిమాండ్ చేసారు. అలాగే హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలని హరీష్ సూచించారు. 

ఇక 60ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ (కోమార్బిడిటీస్ తో సంబంధం లేకుండా) ప్రికాషనరి డోసు ఇవ్వాలని సూచించారు. 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరునికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోస్ పాలసీలు, వాటి ఫలితాల ఆధారంగా పై ప్రతిపాదనలు మీ ముందు ఉంచుతున్నామని...  వీటిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు హరీష్ రావు. 

ఇదిలావుంటే రాష్ట్రంలో కరోనా కట్టడికి టెస్టుల సంఖ్య పెంచాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కోవిడ్ థర్డ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ క్రమంలో ఈనెల 12 వరకు తెలంగాణవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ రిపోర్టు ఆధారంగా  హైకోర్టు విచారణ జ‌రిపింది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రోజుకు క‌నీసం లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలన్న ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. అదే స‌మ‌యంలో ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా నివేదించాల‌ని ఆదేశించింది. రాష్ట్రంలో క‌రోనా నియ‌మ నిబంద‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని సూచించారు. అలాగే.. భౌతికదూరం, మాస్కులు ధ‌రించ‌డం వంటి నిబంధ‌న‌లను క‌ఠిన‌త‌రం చేయాల‌ని సూచించారు. 

ఇటీవ‌ల తెలంగాణ ఆస్ప‌త్రుల్లో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే గాంధీ, ఉస్మానియా ఆస్ప‌త్రుల్లో వంద‌ల సంఖ్య‌లో వైద్యులు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు క‌రోనా బారిన‌ప‌డ్డారు. తాజాగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా (Coronavirus) కలకలం రేపింది.. సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతో సహా 69 మంది ఆసుపత్రి సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మ‌రింత మంది ఫ‌లితాలు రావాల్సి ఉంది. కాబ‌ట్టి ఎంజీఎం ఆస్ప‌త్రిలో క‌రోనా బారిన‌ప‌డ్డ వైద్యులు, ఇత‌ర వైద్య సిబ్బంది సంఖ్య పెరిగే అవ‌కాశం వుంది.  

ఇక తెలంగాణ పోలీస్ శాఖ ను కూడా కరోనా వైరస్ కలవరపెడుతోంది. రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలువురు సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా థర్డ్ వేవ్ లో సుమారు 500మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. మొదటి దశలో 2,000మందికి పోలీసులకు కోవిడ్ సోకింది. రెండో దశలో 700మందికి పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. 
 

click me!