తెలంగాణలో ఉద్యోగుల ఆందోళనపై బాలకృష్ణ కామెంట్స్.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన నందమూరి ఫ్యామిలీ..

By Sumanth KanukulaFirst Published Jan 18, 2022, 10:30 AM IST
Highlights

నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 26వ వర్దంతి (NTR death anniversary) సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగుల ఆందోళనపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 26వ వర్దంతి (NTR death anniversary) సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), రామకృష్ణ, సుహాసిని.. ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నందమూరి బాలకృష్ణ.. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఉంటారని అన్నారు. మనకు ఆదర్శంగా నిలిచిన తెలుగు జాతి ముద్దు బిడ్డ ఎన్టీఆర్ అని చెప్పారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ స్పూర్తిగా నిలిచారని అన్నారు. 

పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చారని.. బడుగు, బలహీన వర్గాల వారికి చేయూత ఇచ్చి.. వారిని అధికార పదవులు కల్పించారని చెప్పారు. ఎన్టీఆర్ తెలుగు గంగతో రాయలసీమను సస్యశ్యామలం చేసి.. అపర భగీరథుడిగా నిలిచారని బాలకృష్ణ అన్నారు. మాట తప్పని ఎన్టీఆర్ వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం అని అన్నారు. ఎన్టీఆర్ భరతమాత ముద్దు బిడ్డ అని చెప్పారు. 

ఈ సందర్భంగా తెలంగాణలో ఉద్యోగుల ఆందోళనపై బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. స్థానికులకు అక్కడే ఉద్యోగాలు ఇవ్వాలని ఎన్టీఆర్ ఆనాడే 610 జీవోను అమలు చేశారని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో స్థానికతపై ఉద్యోగుల ఆందోళనలు జరుగుతున్నాయని అన్నారు. ఉపాధ్యాయుల నిరసనల తెలుపుతున్నారని ప్రస్తావించారు.

ఎన్టీఆర్‌‌పై పాటను రిలీజ్ చేసిన బాలకృష్ణ..
నందమూరి తారకరామరావుపై ఓ అభిమాని రాసిన పాటను బాలకృష్ణ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అమెరికాలో నివాసంలో ఉంటున్న అశ్విన్ అట్లూరి అనే ఎన్టీఆర్ అభిమాని.. ఈ పాటను రాసి నిర్మించారని బాలకృష్ణ తెలిపారు. బాజీ సంగీతం సమకూర్చారని... అంజన సౌమ్య, స్వరాగ్‌లు గాత్రం అందించారని చెప్పారు. అశ్విన్ కోరిక మేరకు అభిమానులందరి తరఫున తాను పాటను ఈరోజు ఆవిష్కరిస్తున్నట్టుగా వెల్లడించారు. 

click me!