Congress Strategy: తెలంగాణలో కర్ణాటక ఫార్ములా.. హైకమాండ్ సూచించిన ఐదు ముఖ్యమైన పాయింట్లు ఇవే

By Mahesh KFirst Published Jun 27, 2023, 7:51 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయవంతమైన కర్ణాటక ఫార్ములానే అమలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్‌లో కర్ణాటక ఫార్ములాకు చెందిన ఐదు పాయింట్లను వివరించారు. కర్ణాటకలో విజయవంతమైన ఈ ఫార్ములా తెలంగాణలోనూ సక్సెస్ అవుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు.
 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఫార్ములానే అమలు చేయబోతున్నది. ఈ ఫార్ములాలో ఐదు కీలక అంశాలు ఉన్నాయి. 1. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ప్రచారం, 2. కాంగ్రెస్ వ్యవస్థాగతంగా సుస్థిరం కావడం, 3. పార్టీ అన్ని విభాగాలను క్రియాశీలం చేయడం, 4. శక్తివంతంగా ఎలక్షనీరింగ్ చేపట్టడం, 5. ఆకర్షణీయ ఎన్నికల హామీలతో ప్రజలకు గ్యారంటీ కార్డ్ ప్రకటించడం.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీలు ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీ కాంగ్రెస్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ స్ట్రాటజీ మీటింగ్‌లో కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా సుమారు 30 మంది నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశం తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని భేటీ అనంతరం ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

కర్ణాటకలో బీజేపీ శాయశక్తులా గెలుపునకు ప్రయత్నించినా కాంగ్రెస్సే పైచేయి సాధించింది. స్వయంగా ప్రధాని మోడీ పెద్ద మొత్తంలో సభల్లో పాల్గొని ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. అమిత్ షా, నడ్డాల ప్రయత్నాలూ నిష్ఫలమయ్యాయి. 228 స్థానాల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో గెలిచింది. ఇదే హుషారు.. త్వరలో జరగబోతున్న తెలంగాణ, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల్లోనూ ఉంటుందని కాంగ్రెస్ భావిస్తున్నది. కనీసం మూడు నుంచి నాలుగు రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరేస్తామని ఇటీవలే రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో పేర్కొనడం గమనార్హం.

కర్ణాటక ఫార్ములా ఏమిటీ?

తెలంగాణ నేతల ముందు రాహుల్ గాంధీ కర్ణాటక ఫార్ములా ఉంచారు. ఇంతకీ ఫార్ములా ఏమిటీ? సింపుల్.. 2014, 2019 ఎన్నికల్లో ఓటమితో నిరాశంలో కుంగిన పార్టీ నేతల్లో మళ్లీ నూతన ఉత్తేజాన్ని నింపడమే ఈ ఫార్ములా. వారిని మానసికంగా బలోపేతం చేయడం. కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం వచ్చిందని, వారు కూడా పోరాడి గెలవగలరనే నమ్మకం కలిగిందని ఏఐసీసీ నేత ఒకరు తెలిపారు.

ఈ ఫార్ములా ప్రకారం, కర్ణాటకలో అప్పటి సీఎం బసవరాజు బొమ్మైపై 40 శాతం అవినీతి ఆరోపణ వంటి అస్త్రాలను సిద్ధం చేసుకుని తీవ్రంగా ప్రచారం చేయడం. ఇక్కడ భూ లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌ను రద్దు చేయడం, భూ రికార్డులను రద్దు చేయడం వంటి కొన్ని స్పష్టమైన అంశాలను అస్త్రాలుగా చేసుకోవాలి.

Also Read: భట్టి పాదయాత్రలో గద్దర్ ప్రత్యక్షం.. ‘గద్దరన్న జీవితం ప్రజలకు అంకితం’

రెండోది, పార్టీలో నాయకులు తాత్కాలికంగానైనా విభేదాలు పక్కనపెట్టి ఒక్కటవ్వాలి. ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఐకమత్యం లేదని. వాటిని తొలగించే ప్రయత్నాలు సఫలం కాలేవు. కాబట్టి, మొదలు వారి మధ్య విభేదాలు పక్కనపెట్టి ఏకం కావాలి. కలిసుంటేనే గెలవగలం, లేదంటే పరాజయమే అనే మంత్రాన్ని రాహుల్ గాంధీ నూరిపోశారు.

పార్టీ వింగ్‌లనూ సన్నద్ధం చేయడం మరో ముఖ్యమైన పాయింట్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా విభాగాలను క్రియాశీలం చేసి ఆయా వర్గాలకు చేరువ కావాలి. కుల సంఘాలు, కమ్యూనిటీ నెట్‌వర్క్‌లకు చేరువ కావాలని ఖర్గే నిర్దేశించారు. కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకుగా ఉండిన ముస్లిం, క్రిస్టియన్‌లను మళ్లీ వెనక్కి తెచ్చుకోవడంపై దృష్టి పెట్టాలి.

పటిష్టమైన క్యాంపెయిన్ చేపట్టాలి. ప్రియాంక గాంధీ, సోనియా గాంధీలు వీలైనంత ఎక్కువగా తెలంగాణ సభలకు హాజరవ్వాలి. అనారోగ్య కారణాల రీత్యా సోనియా గాంధీ ఎక్కువ సభలకు హాజరుకాకపోవచ్చు. కానీ, ప్రియాంక మాత్రం ఈ ప్రతిపాదనలకు అంగీకరించింది. ఆమె తొలి సభ మహబూబ్‌నగర్‌లో ఉండొచ్చు. జులై మధ్యలో నిర్వహించే ఈ సభలో జూపల్లి పార్టీలోకి చేరుతారు.

ఇక చివరి ముఖ్యాంశం ఏమిటంటే.. వోటర్లకు హామీపత్రం అందివ్వాలి. ఇది కర్ణాటకలో మంచి ఫలితాలను ఇచ్చింది. తెలంగాణలోనూ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ రైతుల డిక్లరేషన్, యువత డిక్లరేషన్‌లను రాహుల్, ప్రియాంకల ద్వారా ప్రకటించి ఉన్నది. ఇలాంటివే మరికొన్ని డిక్లరేషన్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సేవలు, మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

click me!