'ఆమె తెలంగాణ కోడలయితే.. నేను ఆడబిడ్డని..' : షర్మిలపై రేణుకా చౌదరి ఫైర్

By Rajesh Karampoori  |  First Published Sep 4, 2023, 4:48 AM IST

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలేరులో పోటీ చేయడానికి ఇంకా ఎవరైనా మిగిలున్నారా? అంటూ షర్మిలపై సెటైర్లు వేశారు .


అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముచ్చటగా మూడోసారి కూడా తామే విజయం సాధిస్తామని అధికార బిఆర్ఎస్ ధీమాగా ఉండగా.. ఎలాగైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి.. అధికార పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది. ఇదిలా ఉంటే.. వైయస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని భావిస్తుంది. 

ఈ తరుణంలో వైయస్ షర్మిల కాంగ్రెస్ అధిష్టాన పెద్దలైన రాహుల్ గాంధీ, సోనియాగాంధీలతో ప్రత్యేక భేటీ అయింది. అయితే షర్మిల తన పార్టీని ..కాంగ్రెస్ పార్టీలో చేరడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తుండగా.. మరికొందరు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

Latest Videos

తాజా గా వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంపై విమర్శలు గుప్పించారు. షర్మిల తెలంగాణ కోడలైతే.. తాను తెలంగాణ ఆడబిడ్డనని అన్నారు. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం పై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవాలని కేవలం షర్మిల చెప్తే సరిపోదని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు తాను తెలంగాణ కోడలు అని గుర్తు వచ్చిందా అని విమర్శించారు. షర్మిల ముందు అమరావతి రైతుల గురించి మాట్లాడాలని సూచించారు. 

అలాగే .  తాను పాలేరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని షర్మిల ప్రకటించడంపై కూడా రేణుక చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.   పాలేరులో పోటీ చేయడానికి ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అంటూ వ్యంగ్యాస్త్రాలు అందించారు. అసలు ఆంధ్ర నేతలకు తెలంగాణలో ఏం పని ప్రశ్నించారు. తెలంగాణలో షర్మిల ఎంతో.. ఏపీలో తాను కూడా అంతేనని రేణుక చౌదరి అన్నారు.

కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి పేరు చెబుతారో వారు పాలేరు నుండి పోటీ చేస్తే బాగుంటుందని అన్నారు. అసలు షర్మిల పాలేరులో పుట్టిందా? ఆమె పాలేరుకు ఏమైనా చేసిందా? పాలేరు ప్రజల సమస్యలను తీర్చారా? అంటూ ప్రశ్నించారు. ఊరు పేరు లేని వారు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తే వారిని రాజకీయ రాబందులు అంటారని ఫైర్ అయ్యారు. ఇన్నాళ్లు వైఎస్ షర్మిల ఎక్కడ ఉన్నారని రేణుక చౌదరి విరుచుకపడ్డారు.

click me!