సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి గద్దర్ కుమార్తె డాక్టర్ జీవీ వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఇచ్చిన మాటకు కట్టుబడటంతో పాటు కంటోన్మెంట్ ప్రాంతంలో గద్ధర్ కుటుంబానికి వున్న పాపులారిటీ ఆధారంగా వెన్నెలకు టికెట్ కేటాయించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 45 మందితో తన రెండో జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో స్థానం దక్కనివారికి సెకండ్ లిస్ట్‌లో అవకాశం కల్పించింది. ఇద్దరు మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ గౌడ్‌లకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చింది. ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది దివంగత ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్ధర్ కుటుంబం గురించి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి గద్దర్ కుమార్తె డాక్టర్ జీవీ వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది.
పెద్దాయన చనిపోవడానికి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీతో చనువుగా వున్నారు. అయిన కాలం చేశాక.. కాంగ్రెస్ నేతలు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. అయితే ఆ తర్వాత గద్ధర్ కుటుంబం పేరు వార్తల్లో ఎక్కడా కనిపించకపోవడం పెద్ద దుమారం రేపింది. దీనికి తోడు గద్ధర్ బతికి వున్న రోజుల్లో టికెట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని గద్ధర్ భార్య విమల కొద్దిరోజుల క్రితం మండిపడ్డారు.
undefined
తన కుమార్తె వెన్నెలకు టికెట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదని.. తన బిడ్డకు టికెట్ ఇస్తే ఆమె గెలుపు కోసం కృషి చేస్తానని విమల స్పష్టం చేశారు. గద్ధర్ ప్రజా పోరాటాలు, ఆయన చేసిన త్యాగాలను దృష్టిలో వుంచుకుని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు కుమార్తె వెన్నెల. తమకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదని.. కానీ ఆ పార్టీ సానుభూతిపరులమన్నారు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా , ఇవ్వకపోయినా ఎన్నికల బరిలో నిలుస్తామని వెన్నెల స్పష్టం చేశారు.
ALso Read: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : 45 మందితో రెండో జాబితా ప్రకటించిన కాంగ్రెస్.. లిస్ట్ ఇదే
మా అన్న సూర్యం చాలా సెన్సిటివ్ అని .. ఆయన ఎన్నికలకు దూరంగా వుంటారని, తాను మాత్రం ఎన్నికల బరిలో నిలబడాలని అనుకుంటున్నాని వెన్నెల పేర్కొన్నారు. వెన్నులో బుల్లెట్ వున్నా తన తండ్రి గద్ధర్ జనం కోసం పరితపించారని.. 2023లో తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని గద్దర్ చెప్పారని ఆమె గుర్తుచేశారు. తన తండ్రి కోరిక మేరకు తాను ఎన్నికల బరిలో నిలుస్తానని.. తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారని వెన్నెల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి గద్దర్‌ను కాంగ్రెస్ చేరదీసిందని, అండగా వుంటామని చెప్పిందని అందుకే ఈ పార్టీ నుంచే పోటీ చేస్తానని వెన్నెల స్పష్టం చేశారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని.. రాహుల్ పేదలను అక్కున చేర్చుకుంటున్నారని ఆమె కొనియాడారు.
ఇచ్చిన మాటకు కట్టుబడటంతో పాటు కంటోన్మెంట్ ప్రాంతంలో గద్ధర్ కుటుంబానికి వున్న పాపులారిటీ ఆధారంగా వెన్నెలకు టికెట్ కేటాయించింది. ఒకవేళ గద్ధర్ కుమార్తె స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తే కాంగ్రెస్‌కు పడాల్సిన ఓట్లు అటు టర్న్ అవుతాయేమోనని ఆ పార్టీ పెద్ధలు ఆలోచించి వుండొచ్చని , అందుకే చివరి నిమిషంలో టికెట్ కేటాయించారనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ నిర్ణయం గద్ధర్ అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.