టిఆర్ఎస్ ఎమ్మెల్యే బొడిగ శోభకు 40 కోట్ల ఆస్తులా ?

First Published Sep 28, 2017, 8:35 PM IST
Highlights
  • శోభ ఆస్తులపై స.హా. చట్టం  ద్వారా వివరాలు సేకరణ
  • ఎసిబి, సిబిఐ కి ఫిర్యాదు చేస్తామని ప్రకటన
  • అవసరమైతే కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తాం

టిఆర్ఎస్ పార్టీలో బర్నింగ్ స్టార్ గా పేరుతెచ్చుకున్నారు బొడిగె శోభ. ఆమె కొట్లాడి మరీ టికెట్ తెచ్చుకుని గెలిచి ఎమ్మెల్యేగా నిలిచారు. కానీ ఇటీవల కాలంలో ఆమెపై విమర్శల వర్షం కురుస్తోంది. ఆమె పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టారని విమర్శలు కురిపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు.

తాజాగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభకు 40 కోట్ల ఆస్తులెక్కడివని ప్రశ్నించారు. ఎమ్మెల్యే శోభ సంపాదించిన ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల అఫిడవిట్ లో బొడిగె శోభ ఆస్తుల విలువ రెండు కోట్ల లోపే ఉన్నాయని వివరించారు. శోభ ఆస్తులపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తీసుకొని మరీ వారు మీడియాతో వెల్లడించారు.

2014 ఎన్నికల సమయంలో ఆమె కుటుంబానికి టివిఎస్ బైక్, ఇండికా కారు మాత్రమే ఉన్నాయని, కానీ ఇప్పుడు వారి ఆస్తి 40 కోట్లకు చేరిందని ఆరోపించారు. గంగాధరలో 6 ఎకరాలు, కురిక్యాలలో 50 కుంటల ఇంటి స్థలం సంపాదించారని వివరించారు. హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో రెండు ప్లాట్లు కూడబెట్టారని తెలిపారు. ఇలా తన ఆస్తులు 40 కోట్లు ఉన్నాయని, అవి ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే త్వరలోనే మరిన్ని ఆధారాలు సేకరించి సిబిఐ, ఎసిబి సంస్థలకు ఫిర్యాదు చేయడంతోపాటు అవసరమైతే కోర్టుల్లోనూ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.  ఈ విలేకరుల సమావేశంలో గుమ్లాపూర్ సర్పంచ్ ముత్తా వెంకటరెడ్డి మాట్లాడుతూ తమ మండలంలో మూడు చెరువు పనులు కాంట్రాక్టు చేపడితే ముడుపులివ్వనిదే పనులు ప్రారంభించకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారని ఆరోపించారు.

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/DxYmYB

 

click me!