రానున్న రోజుల్లో ఏ రకమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలనే దానిపై కాంగ్రెస్ సీనియర్లు ఇవాళ సమావేశం కానున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో ఆ పార్టీ నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను సిద్దం చేయనున్నారు.
హైదరాబాద్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ల సమావేశం బుధవారంనాడు జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులతో పాటు ఇతర సీనియర్లను కూడ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులను సమావేశానికి ఆహ్వానించారు .
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు మూడు మాసాలే సమయం ఉన్నందున ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించనున్నారు. మరో వైపు పార్టీలో చేరికలపై కూడ నేతలు చర్చించనున్నారు.ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే కొందరు నేతలు ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
undefined
ఎవరెవరు పార్టీతో టచ్ లో ఉన్నారు. ఎవరెవరిని పార్టీలో చేర్చుకోవాలనే విషయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరో వైపు ఎన్నికల షెడ్యూల్ వెలువడే వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలంతా పర్యటించాలనే ప్రతిపాదన కూడ ఉంది. అయితే బస్సు యాత్ర చేయాలా, మరో రూపంలో ప్రజల వద్దకు వెళ్లాలా అనే దానిపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పార్టీ సీనియర్లంతా పాల్గొన్నారు. ఇదే తరహాలో యాత్ర నిర్వహించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. ఇందుకు గాను కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు.