మంత్రి ఎర్రబెల్లి క్యాంప్ ఆఫీస్ లో కుప్పకూలిన భారీ చెట్టు... తప్పిన పెను ప్రమాదం

By Arun Kumar P  |  First Published Jul 19, 2023, 11:37 AM IST

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రమాదాలు సృష్టిస్తున్నాయి. ఈ వర్షాల దాటికి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు క్యాంప్ ఆఫీస్ లో భారీ వృక్షం కుప్పకూలింది.    


వరంగల్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రమాదాలను సృష్టిస్తున్నాయి. వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు క్యాంప్ కార్యాలయంలో భారీ వృక్షం కుప్పకూలింది. అలాగే ప్రహారిగోడ కూడా ధ్వంసమయ్యింది. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

చెట్టు కూలిన విషయం తెలిసి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది కొమ్మలను అక్కడినుండి తరలిస్తున్నారు. అలాగే క్యాంప్ ఆఫీస్ రక్షణకోసం నిర్మించిన ప్రహారిగోడ కూలడంతో తిరిగి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

Latest Videos

ఇదిలావుంటే రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండి) హెచ్చరించింది. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఐఎండి రెడ్ అలర్ట్ జారీచేసింది. 

Read More  వర్షాల ఎఫెక్ట్ : నారాయణపేట జిల్లాలో కుప్పకూలిన స్కూల్.. తప్పిన పెను ప్రమాదం...

కుండపోతగా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందిని రంగంలోకి దింపడంతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపుచేరే అవకాశాలుండటంతో ప్రజలను కూడా జాగ్రత్తగా వుండాలని సూచిస్తున్నారు. ఏదయినా సహాయం  కావాలంటే ఫోన్ చేయాలంటూ టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటుచేసారు. 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.భూపాలపల్లి పరిధిలోని ఓపెన్ కాస్ట గనుల్లో గత రెండ్రోజులుగా 14వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని... దీనివల్ల సంస్థకు రూ.3 కోట్ల నష్టం వాటిల్లినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. 

click me!