
ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నేతలంతా తెలంగాణ కావాలని ముక్త కంఠంతో కోరారని గుర్తుచేశారు ఆ పార్టీ సీనియర్ నేత , మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్. కరీంనగర్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభకు ఆయన హాజరై ప్రసంగించారు. అందరి కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌కు బూస్టర్ డోస్ లా పనిచేసిందన్నారు. కేసీఆర్ హరావ్... తెలంగాణ బచావో అంటూ జైరాం రమేశ్ పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను ఓడించి తెలంగాణను కాపాడుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. చరిత్రలో తానీషా, నిజాం నిరంకుశ పాలన గురించి పుస్తకాల్లో చదివామని.. కానీ కేసీఆర్ ఎనిమిదవ నిజాం లా వ్యవహరిస్తున్నాడని జైరాం రమేశ్ దుయ్యబట్టారు. గుజరాత్ మోడల్ లో ఒక క్రికెట్ స్టేడియం మాత్రమే కనిపిస్తోందని.. ఛత్తీస్‌ఘడ్ మోడల్‌లో రైతుల జీవితాల్లో వెలుగులు కనిపిస్తున్నాయని పిలుపునిచ్చారు. అందుకే గుజరాత్ మోడల్ కాదు.. ఛత్తీస్‌ఘడ్ మోడల్ లక్ష్యంగా పనిచేయాలని జైరాం రమేశ్ అన్నారు.
ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్ మాట్లాడుతూ.. కరీంనగర్, తెలంగాణ రెండింటికీ అవినాభావ సంబంధం ఉందన్నారు. తెలంగాణను ఎప్పుడు గుర్తు చేసుకుంటే అప్పుడు కరీంనగర్ గుర్తొస్తుందన్నారు. తెలంగాణ వచ్చినా రైతులు, నిరుద్యోగులకు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు లభించలేదన్నారు. కేటీఆర్ , హరీష్ రావు, కవితకు ఉపాధి లభించిందని సీఎం సెటైర్లు వేశారు. దేశ సంపద ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్ళిందని.. బీజేపీది గుజరాత్ మోడల్ అని భూపేష్ భగేల్ పేర్కొన్నారు. కుటుంబ పాలన బీఆర్ఎస్ మోడల్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌ఘడ్‌లో రైతులకు మద్దతు ధర కల్పించి... వారి జీవితాల్లో వెలుగులు నింపామని భూపేష్ అన్నారు. కాంగ్రెస్‌ది ఛత్తీస్‌ఘడ్ మోడల్ అని.. దేశంలోకెల్లా రైతులకు ఎంతో మేలు చేసిన ప్రభుత్వం ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వమన్నారు. తెలంగాణలోనూ ఛత్తీస్‌ఘడ్ మోడల్‌ను అమలు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. నిరంకుశ పాలన నుంచి.. పేదలు, రైతుల సంక్షేమాన్ని కోరే కొత్త తెలంగాణ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. అది మీ చేతుల్లోనే ఉందని భూషేష్ చెప్పారు.
ALso REad: తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. బీఆర్ఎస్ కు 25 సీట్లే.. : రేవంత్ రెడ్డి
అంతకుముందు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ఆకాంక్షను నెరవేరుస్తామని కరీంనగర్ నుంచే సోనియా గాంధీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చినా నిధులు మాయమయ్యాయని.. 18 లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ.5 లక్షల కోట్లు అప్పులు చేసినా మిగతా నిధులన్నీ మాయమాయ్యాయని ఆయన ఆరోపించారు. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌లో అంబేద్కర్ పేరు వుండకూడదనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు పెట్టారని భట్టి దుయ్యబట్టారు. ఛత్తీస్‌ఘడ్‌లో అమలవుతున్న పథకాలు.. తెలంగాణలో లేవన్నారు. రైతుల కోసం రాయపూర్ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం కాబోతోందన్నారు.