కేసీఆర్ కు ఆ పదవి ఇప్పించిందే నేను...: తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు

By Arun Kumar P  |  First Published Nov 6, 2023, 6:56 AM IST

ఓడిపోయి మూలన కూర్చున్న తనకు మంత్రి పదవి ఇచ్చానని కేసీఆర్ అంటున్నారు.... కానీ గతంలో తాను ఇదే కేసీఆర్ కు తానే మంత్రిపదవి ఇప్పించానని తుమ్మల నాగేశ్వరావు అన్నారు. 


ఖమ్మం : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లాంటి కీలక నాయకులు బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో ఖమ్మం రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. దీంతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మంపై ప్రత్యేక దృష్టిపెట్టి పార్టీమారిన నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం విమర్శలపై కాంగ్రెస్ లో చేరిన నాయకులు  అంతే ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇలా ప్రస్తుతం సీఎం కేసీఆర్, మాజీమంత్రి తుమ్మల మధ్య మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 

నిన్న(ఆదివారం) ఖమ్మంలో నిర్వహించిన బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాజీ మంత్రి తుమ్మలపై సీరియస్ అయ్యారు కేసీఆర్. పువ్వాడ అజయ్  చేతిలో ఓడిపోయి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో కూర్చుంటే తానే పిలిచిమరీ మంత్రి పదవి ఇచ్చానని సీఎం గుర్తు చేశారు. ఇలా తనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తుమ్మల స్పందించారు. 

Latest Videos

కేసిఆర్ మంత్రి పదవి ఇవ్వడంకాదు తానే కేసీఆర్ కు మంత్రిపదవి ఇప్పించానని తుమ్మల పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ ఎలాగూ ఒప్పుకోడు కాబట్టి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అడిగితే తెలుస్తుందన్నారు. గతంలో తనతో పాటు కేసీఆర్ కూడా టిడిపిలో కొనసాగాడని... ఈ సమయంలోనే ఆయనకు మంత్రి పదవి ఇప్పించానని తుమ్మల తెలిపాడు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫారెస్ట్ శాఖను కేసీఆర్ కు అప్పగించాడని... ఇది ఇష్టంలేకుంటే తానే రవాణా శాఖ ఇప్పించానని అన్నారు. ఇలా చంద్రబాబుతో మాట్లాడి కేసీఆర్ కు పదవి ఇప్పించానని తుమ్మల వెల్లడించారు. 

Read More  శివలింగం మీద తేలు లాంటొడు: కేసీఆర్ పై తుమ్మల సెటైర్లు

ఇక బిఆర్ఎస్ పార్టీలో తనను కేసీఆర్ ప్రేమతోనో, ఓడానన్న జాలితోనో తీసుకోలేదు... ఖమ్మం జిల్లాలో గులాబి జెండా పట్టేవాడు, కట్టేవాడు లేకే చేర్చుకున్నాడని అన్నారు. కేసీఆర్ ఎంతగానో బతిమాలి మరీ తనను బిఆర్ఎస్ లో చేర్చుకున్నారని తుమ్మల అన్నారు. తనకోసమో, కేసీఆర్ కోసమో మంత్రి పదవి తీసుకోలేదని... ఖమ్మం ప్రజల కలల సీతారామ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నానని తెలిపారు. మంత్రి పదవి తనకేమీ కొత్తకాదని... కేసీఆర్ కంటే ముందే మూడుసార్లు మంత్రిగా పనిచేసానని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.  

ఇక కేసీఆర్ అన్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ పువ్వే... కానీ పూజకు పనికిరాని పువ్వు అంటూ తుమ్మల ఎద్దేవా చేసారు. మొదట కమ్యూనిస్ట్ పార్టీని... ఆ తర్వాత కాంగ్రెస్, వైసిపి పార్టీలను మోసంచేసి బిఆర్ఎస్ లో చేరిన పువ్వాడ తమ పార్టీ మార్పు గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను పీడించే మంత్రి ఈ పువ్వాడ అజయ్ అంటూ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆరోపించారు. 

click me!