నామినేషన్ల గడువు దగ్గర పడుతుండడంతో ఈ నాలుగు రోజులు నామినేషన్ల స్వీకరణ జోరందుకోనుంది. నేడు కొంతమంది కీలక నేతలు నామినేషన్లు వేయనున్నారు.
హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ లో నామినేషన్ వేయనున్నారు. ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు టీబీజీపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కరీంనగర్లో బండి సంజయ్ నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్ హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు కరీంనగర్ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి గీతాభవన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఈనెల మూడు నుంచి ప్రారంభమైంది. పదవ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే పలువురు నేతలు నామినేషన్లు సమర్పించారు. ఇప్పటివరకు 240 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు.
రేవంత్ రెడ్డికి కూడా నామినేషన్ల సెంటిమెంటు ఉంది. రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి ఆయన ఎప్పుడు నామినేషన్ వేసిన ఓ గుడిలో తప్పకుండా పూజలు చేస్తుంటారు. అదే వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం. ఈసారి తెలంగాణలో ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండడంతో రేవంత్ రెడ్డి ఈ సెంటిమెంట్ ను మరింత ఖచ్చితంగా పాటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు కొడంగల్ లో నామినేషన్ వేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఊరేగింపుగా వెళ్ళనున్నారు.