Prof. Kodandaram: "కేసీఆర్ మళ్లీ గెలిస్తే.. చిప్ప చేతికి వస్తుంది"

By Rajesh Karampoori  |  First Published Nov 6, 2023, 6:28 AM IST

Prof. Kodandaram: తెలంగాణలో మళ్లి బీఆర్ఎస్  అధికారంలోకి వచ్చే చిప్ప చేతికి వస్తదని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు.


Prof. Kodandaram:తెలంగాణ రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీలన్నీ ప్రచారంలో దూకుడు పెంచుతున్నాయి. ఈ తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నిత్యం మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా అధికార బీఆర్ఎస్ పై తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొ.ఎం.కోదండరామ్‌ విమర్శాస్త్రాలు సంధించారు. గులాబీ అధినేత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై లక్షల కోట్లు వెచ్చించినా తెలంగాణ పరిస్థితి మారలేదని ప్రొ. కోదండరామ్‌ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల మాదిరిగానే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టుకుపోతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాదని, కాంట్రాక్టర్ల ప్రాజెక్టు అని, కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రాజెక్ట్ అయ్యిందని విమర్శించారు. 

Latest Videos

ప్రొ.కోదండరామ్ ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిరుపయోగంగా మారాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన 25 వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందని మండిపడ్డారు.ప్రాజెక్ట్ కారణంగా నిరువాసితులకు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీలో సరైన పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. 

ప్రజలు మరోసారి కేసీఆర్ మళ్లీ గెలిస్తే చిప్ప చేతికి వస్తదని, ప్రజలందరూ  భిక్షాటన చేయాల్సి వస్తుందని టీజేఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎద్దేవా చేశారు. తెలంగాణలో నియంతృత్వ పాలనను తొలగించి ప్రజాస్వామ్య రాజ్యాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వచ్చే ఎన్నికలు వ్యక్తుల గెలుపు కాదు.. తెలంగాణ ప్రజలు గెలుపొందడమే ధ్యేయమని ఆయన అన్నారు. ప్రజాస్వామిక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడాలని కాంగ్రెస్ కు కొన్ని డిమాండ్లతో సంపూర్ణ మద్దతు తెలిపామని వెల్లడించారు. రాష్రంలో రాక్షస పాలన అంతం చేయడానికి మనమందరం పూనుకోవాలని పిలుపునిచ్చారు.

click me!