హైకమాండ్‌తో ముగిసిన టీ.కాంగ్రెస్ నేతల భేటీ.. త్వరలోనే మునుగోడు అభ్యర్ధి ప్రకటన : రేవంత్ రెడ్డి

By Siva KodatiFirst Published Aug 22, 2022, 9:26 PM IST
Highlights

సోనియా గాంధీ నివాసంలో జరిగిన టీ.కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. పార్టీ అంతర్గత విషయాలు , పార్టీలో వివిధ హోదాలలో పదవుల నియామకం, ఉపఎన్నికలో తీసుకోవాల్సిన చర్యలు, అభ్యర్ధి ఎంపికపై సుదీర్ఘమైన చర్చ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. 

సోనియా గాంధీ నివాసంలో జరిగిన టీ.కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చ జరిగింది. ప్రధానంగా మునుగోడు ఉపఎన్నిక, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించారు. ప్రస్తుత పరిస్ధితులపై ప్రియాంక గాంధీ ఆరా తీశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వున్న ప్రస్తుత రాజకీయ పరిస్ధితులు , మునుగోడు ఉపఎన్నికలకు సంబంధించి అందుబాటులో వున్న సీనియర్ నేతలతో సమీక్ష చేశారని చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలు , పార్టీలో వివిధ హోదాలలో పదవుల నియామకం, ఉపఎన్నికలో తీసుకోవాల్సిన చర్యలు, అభ్యర్ధి ఎంపికపై సుదీర్ఘమైన చర్చ జరిగిందన్నారు. 

నేతలంతా అధిష్టానానికి వారి అభిప్రాయాలను కూలంకషంగా చెప్పారని , తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలపై పోరాటం చేయాల్సిందిగా సూచించారని రేవంత్ తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ మీద ఎలా దాడి చేస్తోందో చెప్పామన్నారు. ఉపఎన్నికలలో కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలని పెద్దలు సూచించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే అభ్యర్ధిని ప్రకటిస్తామని... తద్వారా అందరికంటే ముందే శ్రేణులను సిద్ధం చేస్తామని రేవంత్ వెల్లడించారు. 

ALso REad:మాణికం ఠాగూర్ ను తప్పించాలి, రేవంత్ రెడ్డితోనే కాంగ్రెస్ నాశనం:కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాగా.. రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాశనమైందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ పదవి నుండి తప్పించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. సోనియాగాంధీ నివాసంలో జరిగిన సమావేశానికి హాజరు కాకుండా సోమవారం నాడు సాయంత్రం హైద్రాబాద్ కు వచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీగా ఉన్న మాణికం ఠాగూర్ ను ఈ బాధ్యతల నుండి తప్పించాలని ఆయన కోరారు. కమల్ నాథ్ వంటి నేతలకు ఇంచార్జీ బాధ్యతలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం 34 ఏళ్లుగా పనిచేస్తున్న తనలాంటి సీనియర్లకు పార్టీలో అవమానం జరుగుతుందన్నారు.

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరై తాను హైద్రాబాద్ కు వచ్చినట్టుగా ఆయన తెలిపారు.  హడావుడి చేసే లీడర్లకు మాత్రమే పదవులు ఇచ్చారన్నారు. హుజారాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏ రకంగా ప్రచారం చేసి మూడు వేల ఓట్లు తెచ్చుకున్నారో మునుగోడులో కూడా అంతే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు తెచ్చుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు.  పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించనందుకు నిరసనగా తాను ఇవాళ ఢిల్లీలో జరిగిన నేను మీటింగ్  లో పాల్గొనకుండా  హైద్రాబాద్ కు తిరిగి వచ్చినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మునుగోడు ఎన్నికల ప్రచాారానికి వెళ్లబోనని కూడా ఆయన తేల్చి చెప్పారు.

click me!