లెఫ్ట్ పార్టీలతో సీట్ల సర్ధుబాటు ఇవాళ ఖరారు చేయనుంది కాంగ్రెస్ పార్టీ.సీపీఐ, సీపీఎంలతో పొత్తులపై స్పష్టత వచ్చాక మిగిలిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేయనుంది.
హైదరాబాద్: సీపీఐ, సీపీఎంలతో సీట్ల సర్ధుబాటు చర్చలను కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు ఫైనల్ చేయనుంది. ఈ రెండు పార్టీలకు రెండేసీ అసెంబ్లీ టిక్కెట్లను ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కనీసం ఒక్కో పార్టీకి ఐదు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరారు.
అయితే రెండు టిక్కెట్లను కేటాయించేందుకే కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉంది. ఈ విషయమై సీపీఐ, సీపీఎం జాతీయ నాయకత్వాలతో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు చర్చలు జరపనున్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేశారు.
undefined
పొత్తులపై పార్టీ నేతలతో ఆయన చర్చించనున్నారు. చెన్నూరు, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలను సీపీఐకి కేటాయించే అవకాశం ఉంది. అయితే పాలేరు, మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాలను సీపీఎం కోరుతుంది. అయితే మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాన్ని సీపీఎంకు కేటాయించేందుకు కాంగ్రెస్ సానుకూలంగా ఉంది. కానీ, పాలేరు అసెంబ్లీ స్థానం ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం సానుకూలంగా లేదు. పాలేరు అసెంబ్లీ స్థానానికి బదులుగా మరో అసెంబ్లీ స్థానాన్ని కేటాయించేందుకు కాంగ్రెస్ నాయకత్వం సానుకూలంగా ఉంది. మరో అసెంబ్లీ టిక్కెట్టు కేటాయింపు విషయంపై నిర్ణయాన్ని తమకు వదిలేయాలని కాంగ్రెస్ నాయకత్వం సీపీఎంను కోరుతున్నట్టుగా ప్రచారం సాగుతుంది.
పాలేరు అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. ఖమ్మం నుండి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుండి టీడీపీ అభ్యర్ధిగా తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం అసెంబ్లీ స్థానం నుండి పలు దఫాలు సీపీఎం అభ్యర్థులు విజయం సాధించారు.
అయితే భద్రాచలం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే పోడెం వీరయ్యకు కాంగ్రెస్ టిక్కెట్టు కేటాయించింది. గత ఎన్నికల్లో పోడెం వీరయ్య భద్రాచలం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.
లెఫ్ట్ పార్టీలకు కేటాయించే సీట్ల విషయమై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీట్లపై స్పష్టత వచ్చిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను విడుదల చేయనుంది.
ఖమ్మం జిల్లాలో పాలేరు అసెంబ్లీ సీటు కేటాయించకపోతే వైరా అసెంబ్లీ సీటుకు సీపీఎంకు కాంగ్రెస్ కేటాయించే అవకాశం ఉందంటున్నారు. అయితే కాంగ్రెస్ ప్రతిపాదనపై సీపీఎం ఏ రకంగా స్పందించనుందో చూడాలి.
also read:12 మంది వలస నేతలకు కాంగ్రెస్ టిక్కెట్లు:నాగం, మర్రికి నిరాశే
ఇదిలా ఉంటే నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి బదులుగా చెన్నూరు అసెంబ్లీ స్థానాన్ని సీపీఐ కోరుతుందనే ప్రచారం కూడ సాగుతుంది. అయితే ఈ విషయమై సీట్ల సర్ధుబాటు తర్వాత స్పష్టత రానుంది.