తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫోన్ చేసిన ఓ సామాన్యుడి పాఠశాలకు ఆలస్యంగా సెలవులు ప్రకటించడంపై ప్రశ్నించాడు.
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా భారీ నుండి అతిభారీ వర్షాలు ఎడతెలిపి లేకుండా కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నిన్నటి నుండి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సెలవులు ఇవ్వడం బాగానేవున్నా అందుకు సంబంధించి విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన సమయమే సరైంది కాదంటున్నారు తల్లిదండ్రులు. తమ పిల్లలను జోరు వానలోనే స్కూల్ కు పంపిన తర్వాత తాపీగా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించడం ఏమిటి? ముందుగానే ఈ ప్రకటన చేసి వుండాల్సిందని అంటున్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెలవుల ప్రకటనపై చర్చ కొనసాగుతున్న వేళ ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి స్వయంగా మంత్రికే ఫోన్ చేసి ఆలస్యంగా సెలవు ప్రకటించడానికి గల కారణమేంటని అడిగాడు. అతడి ప్రశ్నకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం చెప్పారు.
వరంగల్ కు చెందిన శ్రీనివాస్ భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులివ్వడంపై మాట్లాడేందుకు విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫోన్ చేసాడు. మేడమ్... రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది కదా... మరి అప్పుడే పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తే సరిపోయేది కదా... గురువారం ఉదయం వర్షంలోనే పిల్లలంతా స్కూళ్లకు వెళ్లిపోయాక సెలవులిస్తున్నట్లు ప్రకటించడం ఏమిటి? అంటూ శ్రీనివాస్ విద్యాశాఖమంత్రిని ప్రశ్నించారు.
Read More హైద్రాబాద్‌లో కుండపోత: అధికారులతో తలసాని సమీక్ష, ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన
శ్రీనివాస్ ప్రశ్నలను సావదానంగా విన్న సబితా ఇంద్రారెడ్డి సమాధానం చెప్పారు. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన మాట నిజమే... కానీ భారీ వర్షాలు కాకుండా చిరుజల్లుకు కురుస్తాయని భావించామని అన్నారు. కానీ గురువారం ఉదయం తుంపర్లు కాకుండా జోరువాన కురిసిందని... దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పోన్ చేసి పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఆదేశించారన్నారు. అప్పటికే కాస్త ఆలస్యమైనప్పటికీ సెలవుల ప్రకటన చేసినట్లు విద్యాశాఖమంత్రి తెలిపారు.