అక్రమ బంధానికి అడ్డుగా వున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది ఓ మహిళ. ఈ దారుణ ఘటన ఘట్ కేసర్ లో వెలుగుచూసింది.
హైదరాబాద్ : వివాహేతర సంబంధాలు హాయిగా సాగుతున్న జీవితాలను నాశనం చేస్తున్నాయి. భార్యాభర్తల పవిత్ర బంధంపై అక్రమ సంబంధం పైచేయి సాధిస్తున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నారు. కొందరు మహిళలు మరీ దిగజారి ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను చంపడానికి... పిల్లలను వదిలించుకోడానికి వెనుకాడటం లేదు. ఇలా ప్రియుడి మోజులో అనారోగ్యంతో బాధపడుతున్న భర్తకు విషమిచ్చి చంపింది ఓ మహిళ. బార్యాభర్తల బంధానికే మచ్చలాంటి ఈ సంఘటన హైదరాబాద్ శివారులో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ శివారులోని ఘట్ కేసర్ లో కొత్తగొల్ల తుక్కప్ప, ఈశ్వరమ్మ దంపతులు నివాసముండేవారు. గత కొంతకాలంగా పాక్షిక పక్షవాతంతో బాధపడుతూ తుక్కప్ప మంచాపడ్డాడు. దీంతో అతడి రెండోభార్య అయిన ఈశ్వరమ్మ అదే కాలనీలో నివాసముండే శ్రీనివాస్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇలా చాలాకాలంగా సాగుతున్న వారి అక్రమ బంధం ఇటీవలే బయటపడింది.
ఈశ్వరమ్మ, శ్రీనివాస్ ఏకాంతంగా వుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. దీంతో తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వున్న భర్త తుక్కప్పను అంతమొందించాలని ఈశ్వరమ్మ నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే మద్యంలో విషం కలిపి భర్తతో తాగించిన భార్య ప్రియుడితో కలిసి చెక్కేసింది. అపస్మారకస్థితిలో పడివున్న తుక్కప్పను గుర్తించిన ఘట్ కేసర్ పోలీసులు వెంటనే గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.
Read More ఉసురు తీస్తున్న టమాటా ధరలు.. వారంలో ఇద్దరు రైతుల హత్య.. దోపిడీలు...
తుక్కప్ప మృతి తర్వాత భార్య కనిపించకపోవడంతో ఆమే ఈ పని చేసిందని పోలీసులు అనుమానించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిన్న(గురువారం) ఈశ్వరమ్మతో పాటు ప్రియుడు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసారు. వారిని కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించినట్లు ఘట్ కేసర్ పోలీసులు తెలిపారు.