తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నా కల: సోనియా గాంధీ

By Mahesh Rajamoni  |  First Published Sep 18, 2023, 11:16 AM IST

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తుక్కుగూడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సోనియా ఆరు హామీలు ప్రకటించడం తాను విన్నాననీ, ఆమె పెద్దగా మాట్లాడరు కానీ ఏదైనా చెప్పినప్పుడు అది త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తార‌ని అన్నారు. 2004లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్ ను కాంగ్రెస్ పరిశీలిస్తుందని అన్నారు, దానిని నిజం చేశార‌ని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే ఆరు హామీలను అమలు చేస్తామనీ, కేసీఆర్, ఆయన కుటుంబ ప్రయోజనాల కోసం తాము తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని రాహుల్ గాంధీ అన్నారు.
 


former AICC chief and senior leader Sonia Gandhi:  ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లే ఎన్నికల హామీలను ప్రకటించి క‌ర్నాట‌క‌లో అధికారం ద‌క్కించుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లోనూ ఇదే త‌ర‌హా వ్యూహాల‌తో అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. దీనిలో భాగంగానే వ్యూహాల‌ను అమ‌లు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే తుక్కుగూడ‌లో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణకు ఇదే విధమైన హామీల జాబితాను ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తన కల అనీ, ఆ కలను సాకారం చేసేందుకు ప్రజలు పార్టీకి మద్దతివ్వాలని ఆమె కోరారు. 'తెలంగాణలో అన్ని వర్గాల కోసం పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడాలన్నది మా క‌ల.. మీరంతా మాకు మద్దతు ఇస్తారా?' అని అక్క‌డ‌కు వ‌చ్చిన‌ ప్రజలను ప్రశ్నించారు.

ఆదివారం తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ భారీ 'విజయభేరి' బహిరంగ సభలో సోనియా గాంధీ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఆమె అన్నారు. 'ఈ గొప్ప రాష్ట్రమైన తెలంగాణ ఆవిర్భావంలో నేను, నా సహచరులతో కలిసి భాగమయ్యే అవకాశం లభించింది. ఇప్పుడు దాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది' అని సోనియాగాంధీ అన్నారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఆరు హామీల‌ను సోనియా గాంధీ ప్ర‌క‌టించారు. 

Latest Videos

సోనియా గాంధీ ప్ర‌క‌టించిన కాంగ్రెస్ హామీలు.. 

  • ఎన్నికలకు ముందు తెలంగాణకు ఆరు హామీలను సోనియా ప్రకటించగా, కాంగ్రెస్ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే ఈ హామీలను అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. కర్ణాటకలో కూడా ఇదే విధంగా చేశామని చెప్పారు.
  • 'మహాలక్ష్మి' హామీ కింద కుటుంబ మ‌హిళా పెద్దకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.500కు తగ్గిస్తామనీ, ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామని ప్రకటించారు.
  • రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏటా రూ.15000వేలు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు రూ.12000వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఎంఎస్పీ కాకుండా వరి పంటకు క్వింటాలుకు రూ.500 'బోనస్'గా అందిస్తామని తెలిపారు. 
  • 'గృహజ్యోతి' పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. 'ఇందిరమ్మ ఇండ్లు' పథకం కింద భూమిలేని వారికి ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమ సమరయోధులకు 250 చదరపు గజాల స్థలాన్ని ప్రకటించారు.
  • 'యువ వికాసం' పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విలువైన 'విద్యా భరోసా' కార్డులు, కోచింగ్ ఫీజుల సాయం, ప్ర‌తి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
  • చేయూత పథకం కింద సీనియర్ సిటిజన్లకు నెలకు రూ.4000 వేల పింఛన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల విలువైన వైద్య బీమా అందిస్తామని ప్రకటించారు. 
click me!