
మహారాష్ట్రలో త్వరలో భారీ కిసాన్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. బుధవారం తెలంగాణ భవన్‌లో మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ.. ఏ రాజకీయ నాయకుడికి నీటి గురించి చింత లేదని, ఓట్లు పడుతున్నాయన్నారు. దేశంలో ప్రతీ ఎకరాకు నీరు ఇవ్వొచ్చని.. కానీ పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. బంజారాహిల్స్‌లో ఎలాంటి తాగునీరు అందుతుందో.. ఆదిలాబాద్ గోండు గూడెంలో అదే నీరు అందుతుందన్నారు. ఎన్నికలు వచ్చేసరికి మనకు రకరకాల ఆబ్లిగేషన్లు వస్తుంటాయన్నారు. నీళ్లు ఎక్కడా, ఏ ఫ్యాక్టరీలో తయారు కావని.. అది దేవుడిచ్చిన వరమని కేసీఆర్ అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా దేశంలో ఇంకా ఎక్కడ సమస్యలు అక్కడే వున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మనలో చైతన్యం రానంత వరకు మన జీవితంలో మార్పు రాదని.. కరెంటు విషయంలో తెలంగాణ తప్పించి దేశవ్యాప్తంగా సంక్షోభం వుందన్నారు. గచ్చిరోలి నుంచి గోదావరి ప్రవహిస్తుందని.. కానీ అక్కడ తాగునీరు వుండదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 83 కోట్ల ఎకరాల భూమిలో 41 కోట్ల ఎకరాల భూమి సాగు యోగ్యమైందని.. అయినా బర్గర్లు, పిజ్జాలు తినాల్సిన దౌర్భాగ్యం ఏమొచ్చిందని సీఎం ప్రశ్నించారు.
ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలన్నదే బీఆర్ఎస్ నినాదమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఇంటింటికి తాగునీరు ఇస్తున్నామని.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ.10 వేలు ఇస్తున్నామని.. మహారాష్ట్రలో ఇది ఎందుకు అమలు చేయడం లేదని సీఎం ప్రశ్నించారు. మహారాష్ట్రలో వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలని ఆయన పిలుపునిచ్చారు. అక్కడ ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలున్నారని.. త్వరలోనే అన్ని కమిటీలు వేస్తామన్నారు. నాగపూర్, ఔరంగాబాద్‌లలో శాశ్వత బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని కేసీఆర తెలిపారు.