కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ . తెలంగాణ కోసం కొట్లాడిందెవరో ప్రజలు ఆలోచించాలని, వలసల వనపర్తిని, వరి పంటల వనపర్తిగా చేసిన మొనగాడెవరు అని కేసీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వనపర్తిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. కొందరు కాంగ్రెస్ నేతలు అక్కడికి రా, ఇక్కడికి రా సవాల్ విసురుతున్నారని, అయితే 119 నియోజకవర్గాల్లోనూ కేసీఆర్‌లు వున్నారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం కొట్లాడిందెవరో ప్రజలు ఆలోచించాలని, వలసల వనపర్తిని, వరి పంటల వనపర్తిగా చేసిన మొనగాడెవరు అని కేసీఆర్ ప్రశ్నించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి గతంలో ఎంతోమంది మంత్రులుగా పనిచేశారని.. కానీ ఇక్కడకు ఒక్క వైద్య కళాశాల కూడా తీసుకురాలేకపోయారని దుయ్యబట్టారు. కానీ ప్రస్తుత మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలు పట్టుబట్టి 5 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని కేసీఆర్ ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే వనపర్తిలో లక్ష ఎకరాలకు నీరు అందుతుందని సీఎం ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్‌గానే చూసిందని.. అభివృద్ధిని పట్టించుకోలేదని కేసీఆర్ చురకలంటించారు.
ALso Read: నా దమ్మేందో దేశం చూసింది: కొడంగల్ లో పోటీ చేయాలన్న రేవంత్ సవాల్ పై కేసీఆర్ కౌంటర్
ఓట్ల కోసం అబద్ధాలు చెప్పమని.. మళ్లీ అధికారం అందిస్తే దశలవారీగా పింఛన్లను రూ.5 వేలకు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతులకు ఏ ప్రభుత్వం డబ్బులు ఎదురివ్వలేదని.. ఎన్ని మోటార్లు పెట్టారని ఇవాళ రైతులను ఎవరైనా అడుగుతున్నారా అని సీఎం ప్రశ్నించారు. అన్నదాతలు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే కడుతోందని కేసీఆర్ చెప్పారు. రైతుల భూమిపై వారికే అధికారం కట్టబెట్టామని.. వీఆర్‌వో, ఆర్ఐ, ఎమ్మార్వో పెత్తనం లేకుండా చేశామని సీఎం తెలిపారు. ప్రాజెక్ట్‌లు కట్టకుండా కాళ్లల్లో కట్టులు పెట్టి పాలమూరు పథకాన్ని ఆపేందుకు యత్నించింది ఎవరో అందరికీ తెలుసునని కేసీఆర్ దుయ్యబట్టారు.